సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిన్నది అరగక పాదయాత్ర చేస్తున్నారని, మతాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. డబ్బుల కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జంగ్ సైరన్ పేరిట కార్యక్రమాలు చేస్తున్నారని, జంగ్ లేదు సైరన్ లేదు, అది జంగు పట్టిన పార్టీ అని మండిపడ్డారు. తుపాకీ లేదు.. ఉత్తి తుపేల్ పార్టీ అని కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా రు. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపల్ చైర్మన్ చంద్రకళతోపాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్‌లో చేరారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే వేదికపై గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు పంచన ఉండి తుపాకీ పట్టుకుని ఉద్యమకారుల మీదకు వెళ్లిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. చంపినోడే సంతా పం తెలిపినట్లు శ్రీకాంతాచారి విగ్రహానికి రేవంత్‌దండ వేశారు. తెలంగాణకు మొదటి ద్రోహి రేవంత్. ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ టీపీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నట్లు కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. టీపీసీసీ, టీబీజేపీ అధ్యక్ష పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని పట్టుకుని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు’అని అన్నారు.
రాష్ట్రమంతటా దళితబంధు: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో సుమారు 60 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలించిందని, వారి పాలనలోనే నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పెరిగిందని కేటీఆర్ చెప్పారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ నాయకుల తీరు తల్లిదండ్రులను హత్య చేసి క్షమాభిక్ష కోరిన కుమారుడి తీరును తలపిస్తోందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని ఎద్దేవా చేశారు. తమ నియోజకవర్గంలో దళితబంధు అమలు చేస్తే రాజీనామా చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ, కొందరు నాయకులు చిల్లర మల్లర ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు రాజీనామా చేసినా.. చేయకున్నా రాష్ట్రమంతటా
రైతుబంధు తరహాలో దళితబంధు అమలు చేస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ కొంతకాలంగా దివాలాకోరు రాజకీయాలు చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలనే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు అనంద్, సైదిరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment