ఎంఐఎంతో పొత్తుపై కేటీఆర్‌ క్లారిటీ | Minister KTR Talk On Meet The Press Over GHMC Elections | Sakshi
Sakshi News home page

మీట్‌ ద ప్రెస్‌లో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Published Thu, Nov 19 2020 12:22 PM | Last Updated on Thu, Nov 19 2020 1:15 PM

Minister KTR Talk On Meet The Press Over GHMC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దశాబ్దాల పాటు వెనకబాటుతనానికి గురైన తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హైదరాబాద్‌లో అనిశ్చితి ఉండేదని, తాము అధికారంలోకి వచ్చాక ఎంతో మార్పు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడితే అల్లర్లు జరుగుతాయని విష ప్రచారం చేశారని, ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటే కేసీఆరే కారణంమని పేర్కొన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌పై విపరీతమైన దుష్ప్రచారం చేసినవారంతా నేడు కనుమరుగైయ్యారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ ఎక్కడా గిల్లికజ్జాలకు పోకుండా అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని వివరించారు. టీఆర్‌ఎస్‌ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో పటిష్ట శాంతిభద్రతలున్నాయని చెప్పారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. భాగ్యనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉగాదికి ప్రారంభిస్తామని తెలిపారు. (టీఆర్‌ఎస్‌కు చెక్‌.. కాషాయ వ్యూహం)

ఒంటరిగా 150 స్థానాల్లో పోటీ
గురువారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్ని వివిధ అంశాలపై మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కేటీఆర్‌ స్పందిస్తూ.. మరోసారి గ్రేటర్‌ మేయర్‌ పీఠం తమదేన్నారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా 150 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మిత్రపక్షం ఎంఐఎంతోనూ పొత్తు ఉండదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 5చోట్ల ఎంఐఎంను ఓడించామని, ఈసారి 10చోట్లకుపైగా ఎంఐఎంను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు. గతంలో వచ్చిన ఫలితాలనే బీజేపీ మరోసారి ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. 

ప్రథమ స్థానంలో హైదరాబాద్‌
‘రూ.2వేల కోట్లతో శివారు ప్రాంతాలకు తాగునీరు అందించాం. 1920లో గండిపేట కడితే, 2020లో కేశవాపూర్‌ రిజర్వాయర్‌ కడుతున్నాం. 90శాతం తాగునీటి సమస్యను పరిష్కరించాం. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్‌ కొరత ఉండేది. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్‌ ప్లాంట్‌ను కేంద్రం ఏపీలో కలిపింది. కేసీఆర్‌ ముందుచూపుతో విద్యుత్‌లోటు నుంచి మిగులు విద్యుత్‌కు చేరుకున్నాం. ఇప్పుడు లక్షలాది మంది కార్మికులకు తగినంత పని దొరుకుతుంది. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం తర్వాత చెత్త సేకరణ పెరిగింది. 6,500 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తున్నాం. 40 లక్షల జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ప్రథమస్థానంలో ఉంది. మరో రెండు డంపింగ్‌ యార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తయ్యే ప్లాంట్‌ ప్రారంభించాం. నిర్మాణరంగ వ్యవర్థాలతో తయ్యారయ్యే టైల్స్‌ ప్లాంట్‌ను ప్రారంభించాం.

చివరిదశలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు
నగరంలో పేకాట క్లబ్బులు, గుడుంబా గబ్బు లేదు. బాంబు పేలుళ్లు, మతకలహాలు, పోకిరీల పోకడలు లేవు. ఎస్‌ఆర్‌డీపీ కింద ఫ్లైఓనర్లు నిర్మించాం. 137 లింక్‌ రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. టీఎస్‌ఐపాస్‌తో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. టాప్‌-5 కంపెనీల్లో నాలుగు ఈ ఆరేళ్లలోనే వచ్చాయి. టీఎస్‌ఐపాస్‌తో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. టాప్‌-5 కంపెనీల్లో నాలుగు ఈ ఆరేళ్లలోనే వచ్చాయి. మహేశ్వరం, రావిర్యాలలో కొత్త కంపెనీలు రాబోతున్నాయి. రోజుకు 50వేల మందికి రూ.5కే నాణ్యమైన భోజనం. లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు చివరిదశలో ఉన్నాయి. దసరాకే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇద్దామనుకున్నాం. కరోనా వల్ల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు ఆలస్యమైంది’  అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement