( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: ప్రపంచంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి చంద్రబాబు నాయుడేనని, అమరావతి రైతుల ముసుగులో చేస్తున్నది బాబు స్పాన్సర్డ్ రియల్ ఎస్టేట్ యాత్ర అని రాష్ట్ర రవాణా, సమాచార శాఖల మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే అంతా నయవంచకుడు చంద్రబాబేనని విమర్శించారు. రియల్ ఎస్టేల్ వ్యాపారులు, బాబు ఏజెంట్లు, బినామీలు, టీడీపీ నేతలు యాత్ర చేస్తున్నారని చెప్పారు. దానికి టీడీపీ పాప పరిహార యాత్ర అని పేరు పెడితే బాగుండేదని అన్నారు. యాత్ర పేరుతో టీడీపీ నేతలు నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకుంటున్నారని చెప్పారు.
కోర్టు, న్యాయమూర్తుల కళ్లుకు కూడా గంతలు కట్టి దొంగ యాత్రలు చేస్తున్నారని అన్నారు. మంత్రి నాని శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేదలకు అమరావతిలో ఇళ్లు ఇస్తామని చెబితే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందనే వాళ్లు రైతులు ఎలా అవుతారని ప్రశ్నించారు. దళారులు, ఎరువుల వ్యాపారులతో పాటు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు కూడా రైతుల్ని మోసం చేయడం చూస్తే, ఆఖరికి రైతు పరిస్థితి ఇలా తయారైందా అని బాధ కలుగుతోందన్నారు.
అధికారంలో ఉండగా రైతుల్ని మోసం చేసిన బాబు, పాదయాత్ర పేరుతో మరోసారి మోసం చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో రైతుల పేరుతో ఉన్న పెట్టుబడిదారులను వంచించింది కూడా బాబేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కవ్విస్తూ అమరావతి యాత్ర సాగుతోందని తెలిపారు. పచ్చ కార్యకర్తలు పోలీసులపై రెచ్చిపోయింది పచ్చ మీడియాకు కనిపించడంలేదని, అది రైతుల యాత్రో, రియల్ ఎస్టేట్ వ్యాపారుల యాత్రో ఆ వర్గం మీడియాకు అర్థంకాకపోవడం బాధాకరమని అన్నారు.
కుప్పంలో ఓటుకు రెండు వేలు ఇస్తున్న టీడీపీ
లోకేష్ కుప్పంలో ఓట్లు అడుక్కోవడానికి వెళ్లి చంద్రన్న దేవుడు అనడం చూస్తే వారి బుద్ధి ఇక మారదా అనే అనుమానం వస్తుందన్నారు. డబ్బుతో రాజకీయాలు నడిపే నీచ మనస్తత్వం చంద్రబాబుదని చెప్పారు. కుప్పంలో టీడీపీ ఓటుకు రెండువేలు ఇస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ రాజకీయాల నుంచి ఎన్టీఆర్‌ను గద్దె దించడం వరకూ అంతా చంద్రబాబుది కొనుగోలు బతుకేనన్నారు. అది మీ రక్తంలోనే ఉందనేది లోకేష్ గుర్తెరిగితే మంచిదన్నారు. రెండున్నరేళ్లలో హంద్రీనీవా ప్రాజెక్ట్ విషయంలో ఏం పీకారని లోకేష్ మాట్లాడుతున్నాడని, 1989 నుంచి 2019 వరకు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచి ఏడ్చినోడు ఎవడ్రా అని మేము అనవచ్చునన్నారు. అయితే తమకు సభ్యత, సంస్కారం ఉందని తెలిపారు. కుప్పంలో అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబును.. ‘నాన్నారూ ఏం పీకారంటూ’ లోకేష్ అడగాలన్నారు. గత రెండున్నరేళ్ళలో తండ్రీ కొడుకులు కుప్పంలో ఎందుకు కనిపించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నక్క లాంటి చంద్రబాబుకు గుంటనక్క లాంటి లోకేష్ పుట్టాడని దుయ్యబట్టారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి పంపిస్తే, లోకేష్‌కు చదువు రాలేదు కానీ, బూతులు, కుట్రలు నేర్చుకొచ్చాడని విరుచుకుపడ్డారు.
పయ్యావుల శ్రీరంగ నీతులా?
డిస్కంల బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని పయ్యావుల కేశవ్ జేమ్స్‌బాండ్‌లా ఏదో తవ్వి తీసినట్టు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. 2019 మే 30 వరకూ టీడీపీ సర్కార్ డిస్కంలకు రూ.17 వేల కోట్లు బకాయిలు ఉన్న విషయం పయ్యావులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేసరికి డిస్కంలకు బకాయిలు రూ.3 వేల కోట్లు ఉండగా, అధికారం నుంచి దిగేసరికి రూ. 21వేల కోట్లకు వెళ్లాయన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేసరికి డిస్కింల నష్టాలు రూ.33 వేల కోట్లు ఉన్నాయని, వారు అధికారం నుంచి దిగేనాటికి అవి సుమారు రూ.70 వేల కోట్లకు చేరాయని వివరించారు. ఇవన్నీ మరిచి పయ్యావుల శ్రీరంగ నీతులు చెబుతారా అని ప్రశ్నించారు.
చదవండి: అసలు లోకేష్‌కు ఎయిడెడ్ విద్యాసంస్థలంటే ఏంటో తెలుసా..?: ఆదిమూలపు
కేసీఆర్ ఏం అడుక్కోవడానికి ఢిల్లీ వెళ్తున్నారు?
అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఏపీకి రావాల్సిన నిధుల కోసం కేంద్రాన్ని అడగటానికి తాము ఢిల్లీ వెళ్తున్నామని, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమడుక్కోవడానికి ఢిల్లీ వెళ్తున్నారని మంత్రి ప్రశ్నించారు. ఇంటి బయట కాలర్ ఎగరేసి, ఇంట్లోకి వెళ్లి కాళ్లు పట్టుకునే మనస్తత్వం ఏపీ సీఎం జగన్‌ది కాదని తెలిపారు. లోపలైనా, బయటైనా ఒకటే మాట.. స్నేహం అంటే స్నేహం, ఢీ అంటే ఢీ అంటూ తెలంగాణ మంత్రుల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఆదాయంతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే, దాన్ని పంచేసుకుని ఇప్పుడు వాళ్లు సోకులు పోతున్నారన్నారు. పాడికుండలాంటి హైదరాబాద్‌ను అప్పజెపితేనే అప్పులు పాలైందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకు సంబంధించి సుమారు లక్ష కోట్లు కట్టినట్లు చెప్పారు. వివిధ పథకాలు ద్వారా ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో చేరింది లక్ష కోట్లు పైమాటేనని, తమది పారదర్శక ప్రభుత్వమని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment