పాట్నా: భారతదేశంలో నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలు తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి 'మిసా భారతి' సోమవారం లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.
'మిసా భారతి' లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ వేసిన సమయంలో.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీహార్‌కు ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. కానీ ప్రజలకు చేసినేమీ లేదు. మోదీ దేశం కోసం ఏదైనా చేసి ఉంటే.. ఇప్పుడు రోడ్‌షో నిర్వహించాల్సిన అవసరం లేదని మిసా భారతి అన్నారు. మోదీ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో జాబితా చేసి చెప్పాలని ఆమె కోరారు.
మిసా భారతి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్‌పై పోటీ చేయనున్నారు. ఇక్కడ జూన్ 1న ఓటింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మిసా భారతి 2014, 2019 ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్ చేతిలో పాటలీపుత్ర నియోజకవర్గంలో ఓటమి చవి చూసారు. 2014కు ముందు రామ్ కృపాల్ యాదవ్.. లాలూ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు.
Comments
Please login to add a commentAdd a comment