సాక్షి, జగిత్యాల: టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవి అనూహ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు దక్కింది. అనేకమంది ఆశావహులు కుర్చీ కోసం పోటీపడ్డారు. అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాసాగర్‌రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇంతకాలం కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. గత సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది.
నిరాశలో ఆశావహులు..
కీలకమైన టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తయ్యాక జిల్లా అధ్యక్ష పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశాన్ని సీఎం కేసీఆర్‌కు అప్పగిస్తూ అప్పట్లోనే నిర్ణయించారు. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ నిలి చిపోయింది. గ్రామ, మండల, పట్టణ కమిటీల నియామకం పూర్తయ్యింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ జి ల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావును ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటన చేశారు.
చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే
మంత్రి ఆశీస్సులు ఉన్నవారికే పదవులని..
ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలకు అనుకూలమైన నాయకుల ఆశీస్సులు ఉన్నవారికే టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని భావించారు. ఇందుకు భిన్నంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు అనూహ్యంగా ఆ కుర్చీ దక్కింది. ధర్మపురి జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, మల్యాలకు చెందిన మిట్టపల్లి సుదర్శన్, వెల్గటూర్‌కు చెందిన పునుగోటి శ్రీనివాస్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ఈ పదవిని ఆశించారు. వీరితోపాటు మరికొందరు నాయకులు పోటీపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేలు అందించిన నివేదికలోని పేర్లు, మరికొన్ని పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా జిల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావును ఎంపిక చేసినట్లు తెలిసింది.
పార్టీ భవనం పూర్తి
ధరూర్ క్యాంప్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి భర్తీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బయోడేటా
పేరు : కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే, కోరుట్ల)
జననం: 10 నవంబర్ 1953
జన్మస్థలం: రాఘవపేట
విద్యార్హతలు: బీఏ
రాజకీయ ప్రవేశం..:1977లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ 1997 అక్టోబర్‌లో టీడీపీలో చేరారు. 1998లో ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2001లో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీగా గెలుపొందారు. 2003లో ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా నియమితులయ్యారు.2008లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు.
పార్టీని మరింత బలోపేతం చేస్తా
జగిత్యాల/కోరుట్ల: ‘ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. ఇటీవల టీటీడీ బో ర్డు సభ్యుడిగా అకాశం కల్పించారు. తెలంగా ణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నాకూ అనూహ్యంగా పదవి ఇచ్చారు. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది’ అని కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వెల్లడించారు. ఇంకా ఏమంటున్నారంటే..
సాక్షి : చాలామంది జిల్లా అధ్యక్ష పదవి ఆశించారు. సీఎం కేసీఆర్ మిమ్మల్ని నియమించారు. మీ స్పందన ఏమిటి?
విద్యాసాగర్‌రావు : ఉద్యమ నాయకుడిగా, సీనియర్ ఎమ్మెల్యేగా నాకు ఈ పదవి అప్పగించారు. బాధ్యతగా ఈ పదవిని నిర్వర్తిస్తా.
సాక్షి : ఆశావహులు నిరాశలో ఉంటారు, వారిని ఎలా కలుపుకుపోతారు?
విద్యాసాగర్‌రావు : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తా.
సాక్షి : చాలామంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు?
విద్యాసాగర్‌రావు : జిల్లామంత్రి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆశావహులకు న్యాయం చేస్తా.
సాక్షి : రానున్న ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా ఎలాంటి చర్యలు చేపడతారు?
విద్యాసాగర్‌రావు : టీఆర్‌ఎస్ ఇప్పటికే నంబర్‌వన్ స్థానంలో ఉంది. రానున్న ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో గెలుస్తాం. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాం.
సాక్షి : ఎమ్మెల్యేగా, టీటీడీ సభ్యుడిగా, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడి.. వీటన్నింటికీ ఎలా న్యాయం చేస్తారు?
విద్యాసాగర్‌రావు : ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నా. టీటీడీ సభ్యుడిగా భక్తులకు దైవ దర్శనం కల్పిస్తున్నాం. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయపరుస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment