
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనులను, ఆదిలాబాద్‌లో సీసీఐకి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు అమ్మడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ఏం సాధించాలనుకుంటోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. వీటిని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బును తెలంగాణ కోసమే వినియోగిస్తారా అని నిలదీశారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని బుధవారం ఆమె ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి చర్చించారన్నారు. పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ కూడా చాలాసార్లు కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. సిమెంటు ఫ్యాక్టరీని తెరిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా అమ్మకానికి పెట్టడం వెనక ఉన్న ఉద్దేశమేంటని నిలదీశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్మి, వచ్చే డబ్బుతో అసలేం చేయబోతున్నారో చెప్పే చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు ఉందా? అని ప్రశ్నించారు.
ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా
దేశంలో ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉందని కవిత అన్నారు. ప్రాంతీయ పార్టీలతోనే జాతీయ పార్టీల మనుగడ ఆధారపడి ఉందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండా ఉందని, రాహుల్‌గాంధీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ తరహాలో ప్రాంతీయ పార్టీలకు నాయకత్వ సంక్షోభం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment