సాక్షి, విజయవాడ: అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా చర్చించేందుకు తాను సిద్దమంటూ సవాల్ విసిరారు ఎంపీ కేశినేని నాని. గొల్లపూడిలోని మౌలానగర్‌లో డా.వైఎస్సార్ మైనారిటీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాటు ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మైలవరం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి సర్నాల తిరుపతిరావు, మైలవరం నియోజకవర్గ పరిశీలకులు అప్పిడి కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ, గొల్లపూడికి దేవినేని ఉమా, వసంత చేసిందేమీ లేదన్నారు. వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో తాను ఒక్కసారి కూడా ఎలాంటి శంకుస్థాపన కార్యక్రమాలకు రాలేదన్నారు. 15 లక్షల జనాభా ఉన్న విజయవాడకు చంద్రబాబు వంద కోట్లు కూడా ఇవ్వలేదని, ఫ్లైఓవర్లు.. రోడ్లకు కూడా తానే ఎంపీగా డబ్బులు తెచ్చానని కేశినేని అన్నారు.
‘‘గొల్లపూడికి సీఎం జగన్ రూ. 210 కోట్ల సంక్షేమాన్ని అందించారు. 40 వేల మంది ఉన్న గొల్లపూడిని రూ. 60 కోట్లతో తలశిల రఘురాం అభివృద్ది చేశారు. చంద్రబాబుకు మైనార్టీలంటే పడదు. చంద్రబాబు వంటి మోసగాడిని నమ్మొద్దు. బీజేపీతో చంద్రబాబు ఆడుతున్న నాటకాలను మైనార్టీలంతా గమనించాలి. 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నేనే ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టా. ఆ రోజు ప్రధాని మోదీని తిట్టాడు.. ఇప్పుడు మళ్లీ ఆయన చుట్టూ తిరుగుతున్నాడు’’ అంటూ కేశినేని నాని దుయ్యబట్టారు.
ఓట్ల కోసం మైనార్టీలను చంద్రబాబు ఎలా వాడుకున్నాడో అందరికీ చెప్పాలి. నా అమరావతి అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క సెక్రటేరియట్ కట్టలేకపోయాడు. సీఎం జగన్ 30 వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో సచివాలయాలు కట్టించారు. 175కి 175 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయం’’ అని కేశినేని నాని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment