సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డిలు అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని తెలిపారు. రూ.లక్ష కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సీఎం వైఎస్ జగన్ జమ చేశారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజాదరణతో వైఎస్సార్సీపీ మెజారిటీ గతానికంటే పెరుగుతోందన్నారు. ఎన్నికల కమీషన్ అడ్డుపెట్టుకొని చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఓటమిని ముందే పసిగట్టి బహిష్కరణ డ్రామా ఆడారని దుయ్యబట్టారు. టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు.
అదేవిధంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ 65 స్థానాలకి ఎన్నిక జరిగితే 63 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుందని తెలిపారు. ఆరుకి ఆరు జడ్పీటీసీలూ కైవసం చేసుకొన్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే స్థానిక సంస్థల్లో ఓట్ల శాతం పెరిగిందని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికకీ ప్రజాదరణ పెరుగుతోందని, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమం వల్లే జిల్లాలో ప్రతిపక్షానికి ఒక్క జడ్పీటీసీ కూడా దక్కలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వానికి రాష్ట్రంలో తిరుగులేదని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment