సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి తొలిసారిగా ఉపఎన్నిక జరుగనుంది. తాజామాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. 2018 వరకు ఈ నియోజకవర్గానికి 12 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా, ఆరుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సీపీఐ, ఒకసారి (2014లో) టీఆర్‌ఎస్ గెలిచాయి. 1967కు ముందు మునుగోడు నియోజకవర్గంలోని కొంతభాగం చిన్నకొండూరు, మిగిలిన ప్రాంతం నల్లగొండ నియోజకవర్గంలో ఉండేవి.
మునుగోడు ప్రాంతం చిన్నకొండూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు 1965లో ఒకసారి ఉపఎన్నిక జరిగింది. చిన్నకొండూరు నుంచి 1962 సాధారణ ఎన్నికల్లో సీసీఐ అభ్యర్థి కొండవీటి గురునాథరెడ్డి విజయం సాధించగా, ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీనేత, మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కోర్టులో కేసు వేశారు. ఆ ఎన్నికను రద్దు చేస్తూ కోర్టు మూడేళ్ల తర్వాత తీర్పు చెప్పింది. దీంతో 1965లో చిన్నకొండూరు నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా లక్ష్మణ్ బాపూజీ గెలుపొందారు.
ఆరుసార్లు గెలిచిన కాంగ్రెస్
మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థులే ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1967, 1972, 1978, 1983, 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఇక సీపీఐ అభ్యర్థులు ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 1985, 1989లో, 1994లో ఉజ్జిని నారాయణరావు, 2004లో పల్లా వెంకట్‌రెడ్డి, 2009లో ఉజ్జిని యాదగిరిరావు సీపీఐ అభ్యర్థులుగా గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభాకర్‌రెడ్డిపై 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment