
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం అయిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ ఎమ్మెల్యేలు భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ(శేరిలింగంపల్లి), వివేక్ గౌడ్ (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి), బి సుభాష్‌రెడ్డి(ఉప్పల్) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. తమ సమావేశానికి మంత్రి మల్లారెడ్డే కారణమని తెలిపారు.
పదవులు తీసుకున్న వాళ్లే 3,4 పదవులు తీసుకున్నారని మైనంపల్లి ఆరోపించారు. కార్యకర్తల సమస్యలపై ఎమ్మెల్యేలు కలవడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఇది రహస్య సమావేశం కాదని.. కార్యకర్తల కోసమే భేటి అయినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కేడర్ ఇబ్బందులు పడుతోందని, కేడర్ గురించి మాట్లాడకపోతే డమ్మీలవుతామని అన్నారు.
చదవండి: మేడ్చల్ బీఆర్‌ఎస్‌లో కోల్డ్‌వార్.. మంత్రి మల్లారెడ్డిపై కేటీఆర్ దగ్గరకు ఎమ్మెల్యే పంచాయితీ!
కార్యకర్తల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మంత్రికి లేదా అని మైనంపల్లి ప్రశ్నించారు. కేడర్ కష్టపడి పనిచేస్తోందని.. వారికి న్యాయం జరగాలని అన్నారు. ఎవరో చేసిన దానికి పార్టీ డ్యామేజ్ అవుతోందని ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పనిచేసే క్యాడర్‌ను కాపాడుకోవాలని, సిస్టమ్‌లో మార్పు రావాలని ఆకాక్షించారు.
‘ఎవరో ఒకరు చెప్పకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయి. మా సమావేశం తప్పేమీ కాదు. మంత్రి కేటీఆర్‌ను కలవాలనుకున్నాం. ఈ సమస్య అన్ని పార్టీలో ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ కేడర్‌తో ఎమ్మెల్యేలకు సమస్యలు ఉన్నాయి. కొంతమంది మంత్రులు తమ వాళ్లకు పదవులు ఇప్పించుకున్నారు. నా కొడుకు కోసం మీటింగ్ అన్న ప్రచారం నన్ను హర్ట్ చేసింది’ అని ఎమ్మెల్యే తెలిపారు.