సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నెల 31న మంగళవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా తన అనుచరులతో కలసి నాగం గులాబీ కండువా కప్పుకోనున్నారు.
కేటీఆర్, హరీశ్ ఆహ్వానించడంతో..
నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ అవకాశం దక్కకపోవడంతో ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి హైదరాబాద్‌లోని నాగం నివాసానికి వెళ్లారు.
బీఆర్‌ఎస్‌లోకి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. తర్వాత నాగం జనార్దన్‌రెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నాగం సీనియారిటీని గౌరవించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ భరోసా ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్‌లో డబ్బులున్న వారికే టికెట్లు: నాగం
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతో బాధకు గురిచేశాయని.. అధ్వాన స్థితికి చేరిన కాంగ్రెస్‌కు అధికారం దక్కదని నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఉదయం పార్టీలో చేరిన వారికి సాయంత్రం టికెట్ ఇచ్చారు. సునీల్ కనుగోలు సర్వే ఆధారంగా టికెట్లు ఇచ్చామని రేవంత్ చెప్తున్నారు. పార్టీ జెండా పట్టుకున్న వారికి కాకుండా అవతలి పార్టీలో డబ్బులున్న వారిని పిలిచి టికెట్ ఇస్తున్నారు. నాగర్ కర్నూల్ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కార్యకర్తల ముందుకు వచ్చా. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలసి బీఆర్‌ఎస్ జెండా ఎగరవేస్తాం..’’ అని పేర్కొన్నారు.
సముచిత స్థానం ఇస్తాం: కేటీఆర్
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘సీఎం కేసీఆర్‌కు నాగం జనార్దన్‌రెడ్డి సన్నిహిత మిత్రుడు. తెలంగాణ కోసం గతంలో జైలుకు వెళ్లిన వ్యక్తి. నాగంతోపాటు ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం ఇస్తాం. భవిష్యత్తులో కలసి ముందుకు సాగుతాం..’’ అని చెప్పారు. ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాగం జనార్దన్‌రెడ్డితో కలసి పనిచేసేందుకు తాను సిద్ధమని, ఆయన అడుగు జాడల్లో నడుస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దనరెడ్డి పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌లోకి విష్ణు
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశించి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైంది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆదివారం విష్ణుతోనూ మంతనాలు జరిపారు. తర్వాత ప్రగతిభవన్‌కు తోడ్కొని వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సీఎంతో చర్చించిన తర్వాత తాను బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.
గులాబీ తీర్థం పుచ్చుకున్న పి.చంద్రశేఖర్, ఎర్ర శేఖర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఆదివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ తెలంగాణభవన్‌లో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. జడ్చర్ల కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
వీరి చేరికతో మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్‌ఎస్ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక నేతతోనూ బీఆర్‌ఎస్ మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆ నేత ఒకటి రెండు రోజుల్లో బీఆర్‌ఎస్ గూటికి చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment