యువగళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న వాగ్దానాలు చిత్ర, విచిత్రంగా ఉంటున్నాయి. ఆయన పాదయాత్రకు జన స్పందన ఎలా ఉందన్నది పక్కనబెడితే, టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 లు లోకేష్‌కు నిత్యం విపరీత ప్రచారం ఇస్తున్నాయి. రోజూ ఆయన చేసిన ఉపన్యాసమో, ప్రకటననో ఈ మీడియాలు చాలా ప్రముఖం ఇస్తున్నాయి. అది వారి కమిట్ మెంట్ కాబట్టి దానిపై ఇంకేమీ వ్యాఖ్యానించజాలం. లోకేష్ మాత్రం అదేదో, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినట్లు, తెలుగుదేశం పార్టీ గతంలో పాలన చేయనట్లు, మాట్లాడుతుండడమే విశేషం.
ఉదాహరణకు ఈ మధ్య ఒక పాదయాత్ర సభలో ఆయన ఏపీని ఉద్యోగాంధ్ర ప్రదేశ్ చేస్తానని అన్నారు. అంతగా ఉద్యోగాలు ఇవ్వగలిగితే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉండగా ఎందుకు జాబ్స్ ఇవ్వలేకపోయారు?. పోనీ అప్పుడు ఉద్యోగాలు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు ఇంకా లక్షల ఉద్యోగాల అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి కదా! లోకేష్‌కు టీడీపీ చరిత్ర, ముఖ్యంగా తన తండ్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఏమి చెప్పేవారో తెలిసినట్లు లేదు. ప్రభుత్వాలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత లేదని ఆయన అనేవారు. అంతేకాదు.. విద్య, వైద్యం వంటివాటిని ప్రభుత్వం నడపనవసరం లేదని భావించేవారు. గత టరమ్ లో కూడా ఆ విషయాన్ని బాహాటంగానే చెప్పారు.
విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రైవేటు రంగం చూసుకుంటుందని ఆయన ఒక సందర్భంలో అన్నారు. అనేక కార్పొరేషన్‌లను చంద్రబాబు మూసివేసి గొప్ప సంస్కరణ వాదిగా ప్రచారం చేసుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా యువతకు ఉద్యోగాలు సమకూర్చుతామని చెప్పారు. ఆయన అదే ప్రకారం ఒకేసారి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, వాటిలో యువతకు అవకాశం కల్పించారు. ఇదే టీడీపీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఒకసారి అదంతా వృథా ఖర్చు అని ప్రచారం చేస్తుంటాయి.
మరోసారి మాత్రం తాము ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాంధ్రప్రదేశ్ చేస్తామని చెబుతుంటాయి అదెలా సాధ్యమో చెప్పరు. జగన్ ఆరోగ్య రంగంలో సుమారు నలభై వేల ఉద్యోగాలు ఇస్తున్నారు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి పరీక్షలు జరుగుతున్నాయి. ఇలా వివిధ శాఖలలో ఉద్యోగాలు ఇస్తున్నా, లోకేష్ మాత్రం ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలకు చెబుతుంటే, అదేదో మహా సత్యం మాదిరి టీడీపీ మీడియా పట్టం కట్టి ప్రచురిస్తున్నాయి. రాష్ట్రం నుంచి వలసలను ఆపుతామని కూడా ఆయన అంటున్నారు. రాష్ట్రం అంతా ఎందుకు తన తండ్రి నియోజకవర్గం అయిన కుప్పంలో ఆ పని చేసి ఉండవచ్చు.
పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఆ పని చేయడంలో విఫలం అయ్యారని లోకేష్ ఒప్పుకుంటున్నారా?. కుప్పం నుంచి నిత్యం వందలు, వేల మంది బెంగుళూరుకు వెళ్లి పనులు చేసుకుని తిరిగి వస్తుంటారు. ఆ విషయం బహుశా లోకేష్‌కు తెలియదేమో!. టీడీపీ తెచ్చిన కంపెనీలను నిలబెట్టి ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేవట. ఇంత పెద్ద అబద్దం చెప్పగలగడం అంటే మామూలు సంగతి కాదు. ఏపీలో అలాంటి అసత్యాలు చెప్పగల నైపుణ్యం ఒక్క చంద్రబాబుకే ఉంటుందని అంతా నమ్ముతారు.
ఆయన కుమారుడిగా లోకేష్ ఆ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నారన్నమాట. ఒకవైపు తన నడిచే రోడ్డులో ఉండే పరిశ్రమల ఎదుట సెల్ఫీ దిగి, అవన్ని తమ టైమ్‌లోనివేనని చెప్పుకుంటారు. ఇంకో వైపు జగన్ ఆ పరిశ్రమలన్నీ పంపించివేశారని అంటారు. అబద్దమాడడానికి అయినా హద్దు ఉండాలి. ఏమి చేస్తాం. ఇదంతా ఎందుకు ఆయన చెబుతున్నారంటే, విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సమ్మిట్ అనూహ్యంగా విజయం చెందడంతో ఏమి చెప్పాలో తెలియక చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ఇలాంటి మాటలు చెబుతున్నారు.
దేశంలోనే అత్యంత ప్రముఖమైన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వచ్చి సమ్మిట్‌లో జగన్ చెంత మూడు గంటలకు పైగా కూర్చోవడంతో టీడీపీ నేతలకు దిమ్మదిరిగినంత పనైంది. దాంతో ముఖ్యమంత్రి జగన్ విశ్వసనీయత విపరీతంగా పెరిగింది. దానిని ఎలా చెడగొట్టాలా అన్న దుగ్దతో లోకేష్ కాని, ఇతర టీడీపీ నేతలు కాని ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. మరో వాగ్దానం ఆయన చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ టు పీజీ వరకు విద్యార్ధులకు ఉచిత బస్ పాస్‌లు ఇస్తారట. గత టరమ్‌లో ఆయన ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలి కదా?.
ప్రభుత్వపరంగా విద్యార్ధులకు ఎప్పుడూ బస్ చార్జీలలో రాయితీ ఇచ్చి పాస్‌లు మంజూరు చేస్తుంటారు. జగన్ పాదయాత్రలో చేసే వాగ్దానాలకు ఎంత వ్యయం అవుతుందో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసేది. మరి అదే పని లోకేష్ కాని, చంద్రబాబుకాని ఎందుకు చేయడం లేదు?. జగన్ అధికారంలోకి వచ్చాక తన మానిఫెస్టోని సచివాలయంలోనే పెట్టి, మంత్రులు, అధికారులకు ఇచ్చి దానిని నెరవేర్చాలని మొదటి రోజే ఆదేశించారు. ఆ తర్వాత 98.5 హామీలను అమలు చేసి మరో రికార్డు సృష్టించారు.
అదే తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక, ఎన్నికల మానిఫెస్టోని పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించి అందరిని ఆశ్చర్చపరిచింది. సుమారు 400 హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన టీడీపీ ఇప్పుడు లోకేష్ ఇచ్చే హామీలకు ఎలా కట్టుబడి ఉంటుందో ఆయన కాని, చంద్రబాబు కాని చెప్పగలగాలి కదా!. లోకేష్ మరో ప్రశ్న వేశారు. జగన్ ఒక్క పరిశ్రమను అయినా తెచ్చారా అని అంటున్నారు. కొద్ది కాలం క్రితమే వైఎస్సార్ జిల్లాలో 8800 కోట్ల పెట్టుబడి కలిగిన జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సంగతి లోకేష్‌కు తెలియదేమో!. తెలిసినా, తెలియనట్లు నటిస్తున్నారేమో!.
చదవండి: అసెంబ్లీ ఆవరణలో ఆనాడు చెప్పిన ముచ్చట్లు మరిచారా? ఈనాడు రామోజీ!
బద్వేల్ వద్ద సెంచురి ప్లైవుడ్, కొప్పర్తి లో పారిశ్రామికవాడ, శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలు, అచ్యుతాపురం వద్ద టైర్ల ప్యాక్టరీ, రామాయం పోర్టుకు శంకుస్థాపన ఇలా అనేక విధాలుగా జగన్ టైమ్‌లో పారిశ్రామిక అభివృద్దికి బీజం పడితే, అసలేమీ రాలేదని ఎంత ధైర్యంగా లోకేష్ అబద్దం ఆడగలుగుతున్నారు!. ఒకటి మాత్రం వాస్తవం. ఎన్.టి. రామారావు టైమ్ లో టీడీపీని అబద్దాల పార్టీగా జనం అనుకోలేదు. ఆయనను పడదోసి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాత్రం ఏకంగా అబద్దాల ఫ్యాక్టరీని పెట్టేశారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని లోకేష్ కొనసాగిస్తూ పాదయాత్రను అబద్దాల యాత్రగా మార్చుకున్నట్లుగా ఉంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment