సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ప్రారంభించిన జన్ ఆశీర్వాద్ యాత్ర రాష్ట్రంలో రాజకీయ రగడకు కారణం అవుతోంది. గురువారం మహరాష్ట్రలో తన యాత్రను ప్రారంభించడానికి ముందు ఆయన దాదర్‌లోని శివాజీ పార్క్ మైదానంలోని దివంగత బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన నగరంలోని పలు వీధుల్లో తిరుగుతూ తన యాత్రను కొనసాగించారు. అయితే, బాల్ ఠాక్రే స్మతి స్థలాన్ని రాణే సందర్శించడం పట్ల మండిపడిన కొందరు శివసైనికులు, శుక్రవారం బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని శుద్ధి చేశారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించడంతో అది అపవిత్రమైందని శివసైనికులు ఆరోపించారు.
స్మృతి స్థలాన్ని తొలుత గోమూత్రంతో శుభ్రం చేసి, తరువాత పాలతో అభిషేకం చేశారు. బాల్ ఠాక్రే రాణేను ఎంతో ప్రోత్సహించారని, అండగా నిలిచారని, రాజకీయాల్లో ఉన్నత పదవులివ్వడంతో పాటు ముఖ్యమంత్రిని చేశారని శివసైనికులు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై, ఆయన కుటుంబంపై రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు అనేక ఆరోపణలు చేశారని శివసైనికులు మండిపడ్డారు. రాణే సందర్శనతో స్మృతి స్థలం అపవిత్రమైందని శివసేన ఎమ్మెల్యే మనీషా కాయందే ధ్వజమెత్తారు. పాలతో అభిషేకం చేసిన శివసైనికులను ఆమె ప్రశంసించారు. ‘రాణేకు నచ్చింది ఆయన చేశారు. మాకు నచ్చింది మేం చేశాం’అని మనీషా స్పష్టం చేశారు.
‘2005లో శివసేన నుంచి బయటకు వచ్చిన నారాయణ్ రాణేకు ఇప్పటివరకు బాల్ ఠాక్రే గుర్తుకు రాలేదు. ఆయన ఇప్పటివరకు బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించలేదు. ఇప్పుడు జన్ ఆశీర్వాద్ యాత్ర పేరుతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు రాణేకు బాల్ ఠాక్రే గుర్తుకొచ్చారు’అని మనీషా కాయందే ఎద్దేవా చేశారు. ‘బాల్ ఠాక్రేపై అంత అభిమానం ఉంటే ఆయన కుటుంబంపై ఎందుకు నిప్పులు కక్కుతున్నారు? ఘాటైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు?’అని ఆమె ప్రశ్నించారు.
చదవండి: నాన్ పార్కింగ్ జోన్: మనిషితో సహా బైక్‌ని ఎత్తి వ్యాన్‌లో వేశారు
శివసైనికులు చేసింది తప్పు: ఫడ్నవీస్
నాగ్‌పూర్: రాణే సందర్శనతో బాల్ ఠాక్రే స్మృతి స్థలం అపవిత్రమైందని పేర్కొంటూ శివసైనికులు ఆ స్థలాన్ని శుద్ధి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. స్మృతి స్థలం శుద్ధి సంఘటన గురించి కొందరు విలేకరులు నాగ్‌పూర్‌లో ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ ఇది సంకుచిత మనస్తత్వం గల వాళ్లు చేసే పని అని విమర్శించారు. ఆ పని చేసిన శివసైనికులకు అసలు శివసేన అంటే ఏంటో తెలియదన్నారు.
అప్పట్లో బాల్ ఠాక్రేను జైలుకు పంపించాలని అనుకున్న పార్టీలతోనే ఇప్పుడు శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఫడ్నవీస్ ధ్వజమెత్తారు. అలాంటి పారీ్టలతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా లేనిది, ఒక పాత శివసైనికుడు వెళ్లి నివాళులు అర్పిస్తేనే అపవిత్రం అవుతుందా అని ప్రశ్నించారు. శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పేనని ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment