సాక్షి, ముంబై: తమ తండ్రి దివంగత బాల్‌ఠాక్రే ఆస్తుల వివాదం పరిష్కారమయ్యేవరకు ఉద్ధవ్ ఠాక్రే అధీనంలో ఉన్న ఆస్తులు విక్రయించరాదని పెద్ద కుమారుడు జయదేవ్ ఠాక్రే దాఖలుచేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఉద్ధవ్‌కు కొంతమేర ఊరట లభించింది. ప్రస్తుతం బాల్‌ఠాక్రే ఆస్తులన్నీ ఉద్ధవ్ అధీనంలో ఉన్నాయి. ఈ వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై ఉద్ధవ్ హైకోర్టులో ‘ప్రొబేట్’ దాఖలు చేశారు. దీన్ని జయదేవ్ ఠాక్రే ‘నోటీస్ ఆఫ్ మోషన్’ ద్వారా కోర్టులో సవాలు చేశారు. ఉద్ధవ్ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తన అధీనంలో ఉన్న ఆస్తుల న్నీ విక్రయించే ప్రమాదముందని,వాటిని విక్రయిం చకుండా ఆదేశాలివ్వాలని జయదేవ్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు.
కాగా, బాల్‌ఠాక్రే చనిపోయిన కొద్దిరోజులకే ఆస్తుల విషయమై ఉద్ధవ్, జయదేవ్‌ల మధ్య వాగ్వాదం మొదలైంది. తన తండ్రి రాసిన వీలునామాలో ఆయన సంతకం లేదని, ఆ వీలునామా తప్పుల తడకగా ఉందని జయదేవ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. మరాఠీ భాష అభ్యున్నతి కి పాటుపడే ఆయన ఆంగ్లంలో వీలునామా రాయడమేంటన్నారు. స్థిరాస్తులు, చరాస్తులు బ్యాంక్‌లో డిపాజిట్, ఇలా మొత్తం రూ.14.85 కోట్లు మాత్రమే ఉన్నాయని ఉద్ధవ్ పేర్కొనడం అనుమానంగా ఉందన్నారు.తన తండ్రి నివాసముంటున్న బాంద్రా లోని మాతోశ్రీ బంగ్లా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.40 కోట్లకుపైనే ఉంటుందని, ఇంకా చాలా ఆస్తులు ఉన్నా వాటిని ఉద్ధవ్ వీలునామాలో చూపించలేదని జయదేవ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, రుజువులు చూపించాలని జయదేవ్‌ను కోర్టు కోరింది. కానీ ఆస్తులను ఉద్ధవ్ రహస్యంగా విక్రయించే అవకాశాలున్నాయని ముందుగానే గ్రహించిన జయదేవ్ హైకోర్టులో దాఖలు చేసిన నోటీస్ ఆఫ్ మోషన్‌ను తిరస్కరించింది.
జయదేవ్ పిటిషన్ కొట్టివేత
Published Thu, Apr 3 2014 10:58 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement