చండీగఢ్: తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని పంజాబ్ కాంగ్రెస్ నూతన చీఫ్, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. సిద్ధూ, సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా అధిష్టానం ఆయన్ను ఆదివారం నియమించిన విషయం తెలిసిందే. సోమవారం సిద్ధూ చండీగఢ్ చేరుకుని పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి, కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి, రాహుల్, ప్రియాంకలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రయాణం మొదలైంది. విధేయత కలిగిన కార్యకర్తగా ‘జీతేగా పంజాబ్’మిషన్ సాకారానికి పంజాబ్ కాంగ్రెస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరితోనూ కలిసి పనిచేస్తా. పంజాబ్ మోడల్, అధిష్టానం సూచించిన 18 అంశాల ఎజెండాతో ప్రజల అధికారాన్ని తిరిగి ప్రజలకే అప్పగిస్తా’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
పాటియాలాలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలను కలుసుకుని మొహాలీలోని ఎమ్మెల్యే కుల్జీత్ సింగ్ నగ్రా నివాసానికి వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. అనంతరం పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ జాకఢ్, మంత్రులు రజియా సుల్తానా, తృప్త్ రజీందర్ సింగ్, మాజీ సీఎం రజీందర్ కౌర్ నివాసాలకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లో కాంగ్రెస్ శ్రేణులు, సిద్దూ మద్దతుదారులు స్వీట్లు పంచుకున్నారు. ఇలా ఉండగా, సీఎం అమరీందర్ తీవ్ర వ్యతిరేకత నడుమ సిద్ధూను పీసీపీ చీఫ్‌గా పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సిద్ధూ క్షమాపణ చెప్పే వరకు అతనితో సమావేశమయ్యేది లేదని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. సిద్దూ నియామకంపై ఆయన వర్గం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోమవారం సీఎం అమరీందర్ తన అధికార నివాసంలో పార్టీ నేతలు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment