బీజేపీదే బిహార్‌ | NDA Secures Majority Mark In Gruelling Battle For Bihar Assembly | Sakshi
Sakshi News home page

బీజేపీదే బిహార్‌

Published Wed, Nov 11 2020 3:34 AM | Last Updated on Wed, Nov 11 2020 1:22 PM

NDA Secures Majority Mark In Gruelling Battle For Bihar Assembly - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/ పట్నా: సూపర్‌ ఓవర్‌ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్‌ లాంటి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్‌ షాట్‌ కొట్టింది. చివరి ఓవర్‌ వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు, మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్‌ ది మ్యాచ్‌’ గా ఆర్జేడీ నిలిచింది.

ఆ పార్టీ అత్యధికంగా 76 స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో 73 సీట్లతో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. కూటముల వారీగా చూస్తే.. అధికార ఎన్డీయేలో.. బీజేపీ 73, జేడీయూ 43, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ(వీఐపీ) 4, హెచ్‌ఏఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్‌ 19, లెఫ్ట్‌ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్‌ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కానీ వాటి అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది.

2015లో ఆర్జేడీతో కలిసి పోటీచేసి గద్దెనెక్కిన జేడీయూ.. రెండేళ్లకే ఆర్జేడీతో విభేదించి, బీజేపీకి చేరువై, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నితీశ్‌తో విబేధించి, ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, సొంతంగా బరిలో నిలిచిన లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. కేవలం ఒక్క స్థానాన్నే గెలుచుకుంది. కానీ, సుమారు 30 సీట్లలో శత్రు పక్షం జేడీయూ విజయావకాశాలను ఎల్జేపీ దెబ్బతీయగలిగిందని భావిస్తున్నారు. కాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్డీయే కూటమి మేజిక్‌ మార్క్‌ అయిన 122కి పైనే ఉన్నప్పటికీ.. సాయంత్రం ఒకదశలో 120కి పరిమితమయ్యేసరికి ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్‌ సమయంలో దాదాపు 20కిపైగా స్థానాల్లో ఆయా పార్టీల ఆధిక్యత వెయ్యి లోపే ఉండడంతో తుదివరకు ఉత్కంఠ కొనసాగింది.


ఈ ఎన్నికల్లో ఆర్జేడీ మాజీ చీఫ్‌ అబ్దుల్‌ బారీ సిద్దిఖీ, లాలు ప్రసాద్‌ సన్నిహితుడు భోలా యాదవ్‌ ఓడిపోయారు. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బంధువు, బీజేపీ అభ్యర్థి నీరజ్‌ సింగ్‌ బబ్లూ ఛతాపూర్‌ స్థానం నుంచి గెలుపొందారు. మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ రఘోపూర్‌ స్థానం నుంచి, ఆయన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ హసన్‌పూర్‌ నుంచి గెలుపొందారు. మాజీ షూటర్, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన శ్రేయసి సింగ్‌(బీజేపీ) జముయి నుంచి గెలుపొందారు. హెచ్‌ఏఎం చీఫ్‌ జితన్‌ రామ్‌ మాంఝీ ఇమామ్‌గంజ్‌ స్థానంలో విజయం సాధించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్‌ ఉదయ్‌ నారాయణ్‌ చౌధరిపై ఆయన గెలిచారు. ధమ్‌దహా స్థానం నుంచి జేడీయూ అభ్యర్థి లేసి సింగ్‌ గెలుపొందారు. 

బలం పెంచుకున్న బీజేపీ  
ఈ ఎన్నికల్లో 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 73 స్థానాల్లో విజయం నమోదు చేసింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 157 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం 53 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీచేసి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం విశేషం. అయినప్పటికీ 2010తో పోలిస్తే తక్కువే. 2010లో 102 స్థానాల్లో పోటీచేసి ఏకంగా 91 స్థానాల్లో నెగ్గింది. అప్పుడు కూడా జేడీయూతో పొత్తు ఉంది. జేడీయూతో పొత్తు ఉన్న రెండు సందర్భాల్లోనూ బీజేపీ తన బలం పెంచుకోవడం విశేషం. 2015లో ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్పీ, హిందుస్తాన్‌ ఆవామ్‌ మోర్చాతో కలిసి పోటీచేయగా కేవలం 53 స్థానాల్లో మాత్రమే బీజేపీకి విజయం చేకూరింది. బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో ఎల్‌జేపీ వల్ల నష్టం చేకూరకపోవడం, కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో వలస కూలీలకు ఉచితంగా రైళ్లు నడపడం వంటి పరిణామాలు బీజేపీకి సానుకూలంగా మారాయి. నిరుద్యోగిత అంశం నేరుగా నితీష్‌కుమార్‌పై ప్రభావం చూపిన రీతిలో బీజేపీపై చూపలేదు. 

నితీష్‌ ఓటు బ్యాంకు ఏమేరకు పనిచేసింది? 
2015లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఇప్పుడు 43 సీట్లకు పరిమితమైంది. నితీష్‌కుమార్‌కు మహా దళితులు, ఎంబీసీలు, మహిళలు అండగా నిలవడం వల్లే 43 సీట్లు అయినా దక్కించుకోగలిగారు. ఎల్‌జేపీ ఎన్డీయే కూటమిని వీడి విడిగా పోటీచేయడం వంటి కారణాల వల్ల 2015 నాటి స్థాయిలో జేడీయూ సీట్లు గెలుచుకోలేకపోయింది. యాదవ సామాజిక వర్గం మద్దతు సంపూర్ణంగా లాలూప్రసాద్‌యాదవ్‌కు ఉన్నట్టుగా.. కుర్మి సామాజిక వర్గం నుంచి సంపూర్ణ మద్దతు నితీష్‌కుమార్‌కు లేదు. అత్యంత వెనకబడిన కులాలు, మహాదళితుల నుంచి నితీశ్‌కు మద్దతు ఉంది. అత్యంత బలహీన తరగతులకు ఓబీసీల్లో ప్రత్యేక గుర్తింపు, మహాదళితులకు ఎస్సీల్లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో వారు నితీష్‌ వెన్నంటి నిలిచారు. 


వామపక్షాల ఊపు 
మహాకూటమిలో భాగంగా ఉన్న వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) జోరు కనబరిచాయి. ఆయా వామపక్షాలు మొత్తం 29 సీట్లలో పోటీ చేసి 16 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో సీపీఐ(ఎంఎల్‌) 12, సీపీఐ 2, సీపీఎం 2 సీట్లు గెలుచుకున్నాయి. ఒకప్పుడు బిహార్‌లో వామపక్ష పార్టీలు బలమైన శక్తిగా ఉన్నప్పటికీ, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డాయి. 2010లో కేవలం సీపీఐ ఒక సీటు మాత్రమే గెలుచుకోగా.. 2015లో సీపీఐ(ఎంఎల్‌) మూడు సీట్లు గెలవగలిగింది. ఆర్జేడీ పిలుపునిచ్చిన ‘ఆర్థిక న్యాయం’ నినాదాన్ని వామపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లాయి.  

కాంగ్రెస్‌ బేజారు.. 
70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.  పోటీ చేసిన సీట్లలో కనీసం మూడో వంతు కూడా గెలవలేకపోయింది. అయితే ఆయా సీట్లన్నీ గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నవేనని, అక్కడ గెలవలేకపోవడంలో ఆశ్చర్యమేదీ లేదని ఆ పార్టీ నాయకులే విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌ మరికొన్ని సీట్లు నెగ్గి ఉంటే ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించగలిగేది.  

ఉనికి చాటుకున్న ఎంఐఎం  
అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 2015లో ఇక్కడ ప్రస్తానం ప్రారంభించిన పార్టీ ఈ ఎన్నికల్లో తన ఉనికి చాటుకుంది. అమౌర్‌లో జేడీయూపై(గతంలో కాంగ్రెస్‌ స్థానం), బహదూర్‌గంజ్‌(గతంలో కాంగ్రెస్‌ స్థానం)లో వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీపై, బైసీలో బీజేపీపై(గతంలో ఆర్జేడీ సీటు), జోకిహాట్‌లో ఆర్జేడీపై(గతంలో జేడీయూ), కొచ్చదామన్‌లో జేడీయూ(గతంలోనూ జేడీయూ సీటు)పై ఎంఐఎం గెలిచింది. అంటే మహాకూటమికి చెందిన మూడు స్థానాలను గెల్చింది. రెండు ఎన్డీయే సిట్టింగ్‌ సీట్లను గెలుచుకుంది. 

చతికిలపడిన ఎల్జేపీ 
దివంగత రాంవిలాస్‌పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌జన్‌శక్తి పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. కింగ్‌మేకర్‌ కావాలనుకున్న చిరాగ్‌ పాశ్వాన్‌ ఆశలు ఆవిరయ్యాయి. కేవలం ఒక్క స్థానంలో గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

గొప్పగా ఆశీర్వదించారు : మోదీ
వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గొప్పగా ఆశీర్వదించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో చరిత్రాత్మక విజయం దక్కిందన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో గెలుపు బీజేపీకి ప్రత్యేకం అని పేర్కొన్నారు. గుజరాత్‌ ప్రజలు, బీజేపీ మధ్య ఉన్న బంధం విడదీయరానిదని గుర్తుచేశారు. ఎనిమిది స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వారు తమపై అభిమానం, ఆప్యాయతను చూపించారని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రగతిశీల అజెండా, బీజేపీ రాష్ట్ర శాఖ కఠోరమైన శ్రమతో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించగలిగామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాహిత విధానాలు బీజేపీని ప్రజలకు చేరువ చేశాయని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement