New Parliament Opening: Oppositions Versus BJP - Sakshi
Sakshi News home page

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం: సావర్కర్‌ జయంతి.. రాష్ట్రపతికి నో ఆహ్వానం.. రాజకీయ రగడ

Published Tue, May 23 2023 8:24 AM | Last Updated on Tue, May 23 2023 9:20 AM

New Parliament Opening: Oppositions Versus BJP  - Sakshi

కొత్త పార్లమెంట్‌ ప్రారంభంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించే ప్రయత్నాలు కొనసాగుతుండగా.. అదే తేదీన సావర్కర్‌ జయంతి కావడం, పైగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఇరుపక్షాలు నడుమ సోషల్‌ మీడియాలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి.

వీడీ సావర్కర్‌ జయంతి రోజు కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించడాన్ని.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇది స్వాతంత్ర్య సమరయోధుల్ని పూర్తిగా అవమానించడమేనని విమర్శిస్తోంది. 

లేని చోట వివాదాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటైంది. రాష్ట్రపతి దేశాధినేత. కానీ,  ప్రధానిప్రభుత్వాధినేత.. ప్రభుత్వం తరపున పార్లమెంటుకు నాయకత్వం వహిస్తారు.  ఆ నాయకత్వంలోనే విధానాలు చట్టాల రూపంలో అమలు చేయబడతాయి. రాష్ట్రపతి ఉభయ సభలలో సభ్యులు కాదు. కానీ, ప్రధాని మాత్రం సభ్యులే కదా అని కేంద్ర హోం​ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి ట్వీట్‌ చేశారు. 

కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతిని, మాజీ రాష్ట్రపతిని ఆహ్వానించకుండా.. ప్రభుత్వం పదే పదే ఔచిత్యాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారాయన. గతంలో పార్లమెంట్‌ శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆహ్వానించలేదు.. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు అని ట్వీట్‌ ద్వారా ఖర్గే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం, ఆఖరికి దేశంలోని ప్రతీ పౌరుడికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆమె. దేశానికి ప్రథమ పౌరురాలు. 

ఆయన (ప్రధాని మోదీ) కార్యనిర్వాహక మండలికి అధిపతి అంతేగానీ చట్టసభకు కాదు. ఆ చట్ట సభలోనూ మాకు అధికారాల విభజన ఉంది.  గౌరవనీయులైన లోక్‌సభ స్పీకర్ లేదంటే రాజ్యసభ చైర్‌లు పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించొచ్చు.  ఇది ప్రజల సొమ్ముతో కట్టింది.  ప్రధాని ఏదో తన స్నేహితులు వాళ్ల ప్రైవేట్ నిధుల నుంచి స్పాన్సర్ చేసినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటూ ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్‌ చేశారు. 

మోదీగారి ఫొటోలకు ఫోజులు, సెల్ఫ్‌ ఇమేజ్‌ కోసం పాకులాట.. మర్యాదను, నిబంధనలను   పక్కనపడేసిందని సీబీఐ నేత డీ రాజా విమర్శించారు. 

26 నవంబర్ 2023- దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బహుమతిగా ఇచ్చిన భారత రాజ్యాంగం 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని.. కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఇది తగినది.. అయితే ఇది సావర్కర్ పుట్టినరోజు మే 28న జరుగుతుంది- ఇది ఎంతవరకు సముచితం?” అంటూ తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రే పేర్కొన్నారు.

కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ట్వీట్‌ చేశారు రాహుల్‌. 

కాంగ్రెస్‌ పనికిమాలిన పార్టీ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా విమర్శించారు. వీర సావర్కర్‌.. ప్రతీ భారతీయుడికి గర్వకారణమైన వ్యక్తి. ఆయన కాలి దుమ్ముకు కూడా పనికి రాని వాళ్లు ఇవాళ విమర్శిస్తున్నారని ఘాటుగా మండిపడ్డారు.  పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తే వస్తే నష్టం ఏంటి?. రాహుల్‌ గాంధీవి ఏడుపుగొట్టు రాజకీయాలు. ఏదైనా చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోబోతున్న సమయంలోనే.. ఏదో జరిగిపోతోందన్న రేంజ్‌లో తన గుండెలు బాదుకుంటారు. దేశం ప్రగతి వైపు వెళ్తుంటే.. అపశకునంలా రాహుల్‌ అడ్డుపడుతున్నారు అని గౌరవ్‌ భాటియా మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ సైతం కొత్త పార్లమెంట్‌ భవనం ఆవశ్యకతను చెప్పారని, అలాంటి కలను నిజం చేస్తుంటే పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారాయన.  

ఇదిలా ఉంటే.. పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వ్యతిరేకించేలా విపక్షాలన్నీ కలిసి మెగా సమావేశం నిర్వహించాలని భావిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement