పాట్నా: దేశ రాజకీయ వర్గాల్లో మరో అనూహ‍్య ఘటన చోటుచేసుకుంది. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ సమావేశమయ్యారు. వీరి భేటీపై సర్వత్ర చర్చ జరుగుతోంది.
కాగా, శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సీఎం నితీష్, పీకే కలిసి భోజనం చేశారు. అనంతరం దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని నితీష్ కుమార్ ధృవీకరించారు. అయితే, ఈ భేటీని రాజకీయ కోణంలో చూడవద్దంటూ సీఎం అభిప్రాయపడ్డారు. అంతకు ముందున్న సత్సంబంధాలతోనే తాము కలిసినట్టు వెల్లడించారు.
మరోవైపు పీకే మాట్లాడుతూ.. నితీష్ కుమార్‌ను మర్యాదపూర‍్వకంగానే కలిసినట్టు తెలిపారు. కొన్ని రోజుల క్రితం సీఎం ఒమిక్రాన్ బారినపడినప్పడు ఆయనకు ఫోన్ చేసినట్టు చెప్పారు. అప్పుడు నితీష్ తనకు కలవాలని కోరినట్టు పేర్కొన్నారు. అందుకే తామిద్దరం ఇప్పుడు కలిసినట్టు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా బీహార్‌లో 2020లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నితీష్ కుమార్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న పీకే.. అనూహ్యంగా పార్టీని వీడారు. అప్పటి నుంచి వీరిద్దరూ మళ్లీ కలుసుకోలేదు.
ఇదిలా ఉండగా.. నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ఇటీవల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే అంటూ పీకే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నితీష్, పీకే భేటీపై బీజేపీ శ్రేణులు సైతం దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment