తమ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. బొంబాయి పేరును ముంబయిగా ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చేస్తే లేని తప్పు.. పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మారిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఈ మేరకు కల్‌కత్తాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మమతా మాట్లాడుతూ.. రాష్ట్రం పేరు మార్చేందుకు గతంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని తెలిపారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల వివరణలు ఇచ్చామని, అయినా చాలా కాలంగా రాష్ట్ర పేరును బంగ్లాగా మార్చలేదని మండిపడ్డారు. బొంబాయి, ఒరిస్సా పేర్లను మార్చినప్పుడు.. పశ్చిమ బెంగాల్ పేరు మార్చడానికి అభ్యంతరం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం జాబితాలో తమ రాష్ట్రం పేరు చివరగా ఉంటుందని, దాంతో సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు ఆఖరివరకు వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు.
రాష్ట్ర పేరును పశ్చిమ బెంగాల్ కంటే అక్షర క్రమంలో ముందున్న బంగ్లాగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలకు మమతా వివరించారు. రాష్ట్ర విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు, ఉన్నత విద్యలు అభ్యసించేందుకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ప్రతి సందర్భంలోనూ చివరి వరకు వేచి చూడాల్సి వస్తుందని(ఇంగ్లీష్ అక్షరమాల క్రమంలో W, X, Y, Z), దీని వల్ల బంగ్లా ప్రాముఖ్యత తగ్గుతోందన్నారు. రాష్ట్రం పేరులో ‘పశ్చిమ’ అని చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు.
పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మార్చడం వల్ల నష్టం ఏం లేదని తెలుపుతూ ఓ ఉదాహణ చెప్పారు. ‘ పాకిస్థాన్‌లో పంజాబ్ అనే ప్రావిన్స్ ఉంది. భారత్‌లోనూ పంజాబ్ పేరుతో రాష్ట్రం ఉంది. ఇందులో ఏ సమస్యల ఏదు. అలాంటప్పుడు బంగ్లాదేశ్ పేరుతో ఓ దేశం ఉంటే.. పశ్చిమ బెంగాల్ బంగ్లాగా ఎందుకు మారకదు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment