సాగర్‌ టీఆర్‌ఎస్‌దే.. ఫలించిన సీఎం కేసీఆర్‌ వ్యూహం  | Nomula Bhagat Wins Nagarjuna Sagar Assembly Bypoll | Sakshi
Sakshi News home page

సాగర్‌ టీఆర్‌ఎస్‌దే.. ఫలించిన సీఎం కేసీఆర్‌ వ్యూహం 

Published Mon, May 3 2021 1:45 AM | Last Updated on Mon, May 3 2021 4:34 AM

Nomula Bhagat Wins Nagarjuna Sagar Assembly Bypoll - Sakshi

ఉప ఎన్నికలో గెలుపొందిన తర్వాత తల్లికి పాదాభివందనం చేస్తున్న నోముల భగత్‌ 

సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో గులాబీ మళ్లీ గుబాళించింది. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. దీంతో అది తన సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్థానాన్ని అది నిలబెట్టుకున్నట్లు అయింది. గత నెల 17న ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించగా రెండు వారాల తర్వాత ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. చేజారిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్‌కు, తొలిసారి ఉనికి చాటుకోవాలని భావించిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ ఉపఎన్నిక జరిగింది.

ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిగా నర్సింహయ్య తనయుడు భగత్‌ను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్‌ అభ్యర్థి, సీనియర్‌ నేత కె.జానారెడ్డికి ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఈ ఎన్నికలో మొత్తం 2,20,206 ఓట్లకుగాను 1,90,861 ఓట్లు పోలయ్యాయి. నోముల భగత్‌కు 89,804 ఓట్లు, జానారెడ్డికి 70,932 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్‌ 18,872 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌పై గెలుపొందింది. కేవలం 7,676 ఓట్లను మాత్రమే బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇక్కడ మొత్తంగా 41 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్‌కుమార్‌కు 1,714 ఓట్లు వచ్చాయి. కాగా, నోటాకు 498 ఓట్లు పడ్డాయి.  

‘జానా’కు నాలుగో ఓటమి 
తాజా ఓటమితో జానారెడ్డి తన రాజకీయ జీవితంలో ఇప్పటికీ నాలుగుసార్లు అపజయం పొందినట్లు అయింది. జానారెడ్డి వరుసగా రెండుసార్లు పరాజయం పాలవడం గమనార్హం. తన రాజకీయ జీవిత చరమాంకంలో ఆయనకు ఇది ఊహించని దెబ్బ అని చెప్పవచ్చు. తొలిసారి 1978 ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోగా, 1994లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రెండోసారి, 2018 ఎన్నికల్లో మూడోసారి ఓటమి పాలయ్యారు. ఆయన విజయాల సంఖ్య ఏడు కాగా, ఓటముల సంఖ్య నాలుగుగా నమోదైంది.   చదవండి: (సాగర్‌ తీర్పు: జానారెడ్డి షాకింగ్‌ నిర్ణయం)

యాదవుల ఓట్లపై కన్ను.. తలసానికి బాధ్యత 
ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లున్న యాదవ సామాజికవర్గానికి చెందిన భగత్‌ను బరిలోకి దించిన నేపథ్యంలో వారి ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ వేశారు. అందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు తలసాని సాగర్‌లో మకాం వేసి నియోజకవర్గంలోని అన్ని మండలాల యాదవ సంఘాల నేతలతో సమావేశమై పూర్తి మద్దతును కూడగట్టారు. ఆయా కుల, ఉద్యోగ సంఘాలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏ వర్గాన్నీ విస్మరించకుండా ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. భగత్‌ అత్యధిక మెజారిటీ సాధించడానికి ఇవన్నీ దోహదం చేశాయని చెప్పవచ్చు.

ఫలించిన .. సీఎం కేసీఆర్‌ వ్యూహం 
దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు రాకపోవడంతో సాగర్‌లో విజయం కోసం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పక్కా వ్యూహాన్ని రూపొందించారు. నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉందనగా పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. కనీసం నెలన్నర ముందు నుంచే పార్టీ శ్రేణులను ప్రచారంలోకి దింపారు. ఎమ్మెల్యేను ఇన్‌చార్జీలుగా నియమించి గ్రామాలకు పంపారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే నాటికే నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్రచారం చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ సర్కారు పేరున విస్తృతంగా ప్రచారం చేసింది. మండలాల ఇన్‌చార్జీలుగా వచ్చిన ఎమ్మెల్యేలు (మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు) అభ్యర్థి పేరును ప్రకటించేసరికే పల్లెపల్లెనా తిరిగారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అభ్యర్థి భగత్‌ వెన్నంటే ప్రచారం చేశారు. ఉపఎన్నిక అనివార్యమయ్యాక ఫిబ్రవరిలో ఒకసారి, ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 14న మరోసారి సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలో పర్యటించి, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement