సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితిలో అధికారిక పదవుల్లో ఉన్న వారితో పాటు పలు వురు ముఖ్య నేతలకు తమ పార్టీలోకి రావాలంటూ విపక్ష నేతల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు ముమ్మర ప్రచారం జరుగుతోంది. నిర్ణీత గడువు లోపు తమ పార్టీలో చేరితే ప్రాధాన్యత ఉంటుందనే సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం. తమకు విపక్షాల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు చెబుతున్న అసమ్మతి నేతలు బీఆర్‌ఎస్‌ను వీడ టంపై తమ వైఖరిని వెల్లడించేందుకు మాత్రం ఇష్టపడటం లేదు.
గతంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయ దుమా రాన్ని లేపడంతో కొంతకాలం ఇతర పార్టీల్లోకి వలసల అంశం సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ రాజకీయ భవిష్యత్తును తేల్చుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ నేతలు.. ఇతర పార్టీల నుంచి అందుతున్న ఆహ్వానాలపై తర్జనభర్జన పడుతున్నారు. అధికార పార్టీలోనే కొనసాగితే, చివరి నిమిషంలో టికెట్ దక్కకపోతే పరిస్థితి ఏంటనే ఆందోళన కొందరిలో కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయింపుపై హామీ ఇస్తేనే చేరతామంటూ కొందరు మెలిక పెడుతున్నారు.
ఎన్నికల వ్యయాన్ని భరించాలని కూడా ఓ ప్రధాన జాతీయ పార్టీకి బీఆర్‌ఎస్ అసంతృప్త నేతలు షరతు విధిస్తున్నట్లు సమాచారం. మరికొందరు టికెట్ కోసం సొంత పార్టీపైనే ఒత్తిడి పెంచి హామీ పొందేలా తమ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా వెళ్లడం ద్వారా తమను పక్కన పెట్టలేని పరిస్థితిని సృష్టించాలనే యోచనలో కొందరు ఆశావహులు ఉన్నారు.
సగానికి పైగా స్థానాల్లో టికెట్ల పోటీ...
ఈ ఏడాది చివరలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా సంస్థాగత కార్యకలాపాలను ముమ్మరం చేయడంపై బీఆర్‌ఎస్ దృష్టి కేంద్రీకరించింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యులకే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తుండటం సమస్యగా మారింది.
మరోవైపు పలువురు సీనియర్ నేతలు తమ వారసులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. అలాగే ఉద్యమ సమయం నుంచి పార్టీలో పనిచేస్తున్న నేతలు, వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నేతలతో పాటు ఇతరులు కూడా అసెంబ్లీపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 50 స్థానాల్లో బీఆర్‌ఎస్ టికెట్ల కోసం బహుముఖ పోటీ నెలకొంది.
ఈ క్రమంలో పార్టీ టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్న వారు, నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరును ఎదుర్కొంటున్నవారు, తమను అధిష్టానం గుర్తించడం లేదనే అసంతృప్తితో ఉన్నవారు.. తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌లో ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రధాన విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నేతలపై కేసీఆర్ నజర్
అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్సీ మధుసూధనాచారి నేతృత్వంలోని కమిటీ వీటిపై ఇస్తున్న నివేదికలను విశ్లేషిస్తూ నియోజకవర్గాల వారీగా నేతలపై ఓ అంచనాకు వస్తున్నారు. సమ్మేళనాలను దూరంగా ఉంటున్న నేతలు, వారు దూరంగా ఉండడానికి కారణాలు, వారు భవిష్యత్తులో అనుసరించే వ్యూహాలు తదితరాలపై దృష్టి సారించారు.
♦ ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయనతో పాటు బయటకు వెళ్లే నేతలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరోవైపు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు అసంతృప్త నేతలు పార్టీని వీడకుండా మంతనాలు జరుపుతున్నారు.
♦ మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకర్గంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత నడుమ ఆధిపత్య పోరు కొలిక్కిరావడం లేదు. మంత్రి సత్యవతి రాథోడ్ ములుగుకు బదులుగా డోర్నకల్ నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు టి.రాజయ్య, కడియం శ్రీహరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
♦ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. తన కుమారుడు రోహిత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి నడుమ టికెట్ పోరు సాగుతుండగా రోహిత్ ఎంట్రీ కొత్త చిక్కులు సృష్టిస్తోంది.
♦ ఆలంపూర్, బెల్లంపల్లి, నర్సాపూర్, మహేశ్వరం, చేవెళ్ల, తాండూరు, జహీరాబాద్, కుత్బుల్లాపూర్, పాలేరు, ఆసిఫాబాద్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ తదితర నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌లో బహుముఖ పోటీ నెలకొంది. నాగర్‌కర్నూల్‌లో తన కుమారుడి టికెట్ కోసం ఓ కీలక ప్రజా ప్రతినిధి ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బోథ్, పినపాక, కరీంనగర్, వేములవాడ, మానకొండూరు, మేడ్చల్, రామగుండం తదితర నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా ఇతరులు కూడా టికెట్లు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment