
రండి.. రండి.. ఇక్కడకే దయచేయండి
పిఠాపురంలో నా కోసం ప్రచారం చేయండి
టికెట్లు ఇవ్వని వారికి పవన్ నుంచి పిలుపు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: జనసేన నుంచి టికెట్లు దక్కని వారికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సరికొత్త ఆఫర్ ఇచ్చారు. అలా సీట్లు రాని ఆశావహులు తన గెలుపు కోసం కృషి చేయాలని వర్తమానం పంపారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ ఇచ్చిన పిలుపు ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారుతోంది. భంగపడ్డ జనసేన నేతలకు పార్టీ ముఖ్య నేతలతో ఈ తరహా ఫోన్లు చేయిస్తున్నారు. పవన్ గెలుపు కోసం పని చేయడం ఓ గొప్ప అవకాశంగా భావించాలని ఉచిత సలహా కూడా ఇస్తుండడంతో నిరాశావహులంతా విస్తుపోతున్నారు. ఇలా ప్రచారం చేస్తే ఆయన దృష్టిలో పడతారని, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యతనిస్తారని మరో ఆశ కల్పిస్తున్నారు.
ఎందుకిలా...
మేం ఉండే నియోజకవర్గాలను వదిలి పిఠాపురం ఎందుకు రా.. రమ్మంటున్నారన్న సందేహం ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. తాము ఇక్కడుంటే టికెట్ రాలేదన్న అసంతృప్తితో టీడీపీకి సహాయనిరాకరణ చేస్తామనే అపనమ్మకమా? అక్కడ మా వల్ల ప్రయోజనం ఉంటుందన్న నమ్మకం నిజంగా ఆయనకు ఉందా? అని వారిలో వారు చర్చించుకుంటున్నారు. ఏదైతేనేం. అధినేత పిలుస్తున్నారు కదా.. ఓ సారి వచ్చిపోదామని బయల్దేరుతున్నారు.
♦ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భీమిలి జనసేన సీటును పంచకర్ల సందీప్ ఎప్పటినుంచో ఆశిస్తున్నారు. ఊరించి ఊరించి ఆయనకు ఆఖరికి ‘సారీ’ చెప్పేశారు. తీవ్ర ఆవేదనతో ఉన్న ఆయనకు పిఠాపురం వచ్చేయాలని కబురొచ్చింది. దీంతో ఆయన పిఠాపురం బయల్దేరి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
♦గాజువాక సీటును ఆశించి భంగపడ్డ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు కోన తాతారావుకు కూడా పిఠాపురం రావాలని పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఇప్పటికే పిఠాపురం వెళ్లారు. అక్కడ ప్రచారంలో పాల్గొనడంతోపాటు జనసేన ఎన్నికల ప్రణాళికలు, వ్యూహాల్లో పాలుపంచుకున్నారు.
♦చోడవరం అసెంబ్లీ స్థానంపై ఆశలు పెట్టుకున్న పీవీఎస్‌ఎన్ రాజుకు కూడా పిలుపు
వచ్చింది. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, అక్కడ టీడీపీ సీటును ఆశిస్తున్న ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు పీవీఎస్‌ఎన్ రాజు సమీప బంధువు. దీంతో రాజు పిఠాపురం వెళ్లి వర్మ అభిమతానికి భిన్నంగా, పవన్‌కు అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయడంపై మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలుస్తోంది.
30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం
పవన్ కళ్యాణ్ ఈనెల 30న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ ప్రచారాన్ని ఆరంభించి, మూడు విడతలుగా ప్రచారం కొనసాగిస్తారని సోమవారం జనసేన పార్టీ పేర్కొంది.
ఇదీ చదవండి: ‘దేశం’లో కమలం కల్లోలం