హోల్ సేల్ ధరలకే రిటైల్ అమ్మకం
అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో
జనసేన సీనియర్లకు టిక్కెట్లు లేవు..
కొత్తగా వచ్చినవాళ్లకే పెత్తనం..
మన ఇళ్లలో పెళ్లిళ్లు.. పేరంటాలు.. ఫంక్షన్స్ జరుగుతున్నపుడు చూస్తున్నదే.. బాగా దగ్గరి బంధువులను ‘ఆ మనవాళ్లే ఏమనుకోరులే’ అంటూ వాళ్ళను పట్టించుకోము. సింపుల్‌గా తీసి పడేస్తాం.. కానీ వాళ్ళు.. ఎక్కడెక్కడి నుంచో వచ్చినవాళ్ళను మాత్రం మూడేసి సార్లు పలకరించి టీ, కాఫీలు అందించి వాళ్లకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చి నెత్తినబెట్టుకుంటాం.. చివరకు తేలేది ఏమంటే మనకు కష్టం వచ్చినపుడు మాత్రం మళ్ళీ మన చుట్టూ చేరేది మనవాళ్లే.. ఇందాక మనం అధిక ప్రాధాన్యం ఇచ్చినవాళ్లెవరూ మళ్ళీ కనిపించరు.
జనసేనాని పవన్ సైతం తన పార్టీని అచ్చం అలాగే నడిపిస్తున్నారు. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్న తిరుపతి కిరణ్ రాయల్, విశాఖ బొలిశెట్టి సత్యనారాయణ వంటివాళ్లను టిక్కెట్ల విషయంలో ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. వాళ్ళు మనవాళ్లే కదా.. మనకు అలవాటైనవాళ్లు.. యాడికి పోతారులే.. మన గుమ్మం ముందే ఉంటారు అనే నమ్మకమో.. ఇంకేదో కానీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేదు. భీమిలిలో పంచకర్ల సందీప్ పరిస్థితి కూడా ఇదే.. పాపం ఎన్నాళ్ళనుంచో పార్టీలో ఉన్నా చివరకు టిక్కెట్ దక్కలేదు.
ఎవరెవరికో టిక్కెట్లు దక్కడం.. అదికూడా టీడీపీ నుంచి వచ్చినవాళ్ళను టిక్కెట్లు ఇవ్వడాన్ని చూస్తుంటే పొత్తులో భాగంగా వచ్చిన ఆ 21 సీట్లలో అధిక భాగం చంద్రబాబు చెప్పినవాళ్లకే ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సీట్లు ఇచ్చినందుకు కూడా ఎంతో కొంత ప్యాకేజీ అందుకున్నారేమో అనే సందేహాలు కూడా పార్టీలో వెల్లువెత్తుతున్నాయి. అనంతపురంలో లక్ష్మీపతి, వైజాగ్‌లో సుందరపు సతీష్ లాంటి నేతలు పార్టీకోసం ఎంతో కష్టపడ్డారు. ఆర్థికంగా కూడా అండగా నిలిచారు. వాళ్ళు విరాళాల రూపంలో కూడా భారీగా ముట్టజెప్పినా చివరకు వాళ్లకు ఏమీ లేకపోవడంతో వారి అనుచరులు రగిలిపోతున్నారు.
తెలుగుదేశంలో టిక్కెట్లు రానివాళ్లను చంద్రబాబే మెల్లగా జనసేనలోకి పంపించి టిక్కెట్లు ఇప్పిస్తున్నారని ఆ క్రమంలోనే మొదటి నుంచీ ఉన్న అసలైన జనసేన కేడర్‌ను తొక్కేసి టిక్కెట్లు ఎత్తుకెళ్లిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసి దాన్ని నడపలేక ఏకమొత్తంలో కాంగ్రెస్‌కు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఆయన్ను నమ్ముకున్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది అభిమానులు.. వేలాది మంది కార్యకర్తలు ఘోరంగా నష్టపోయారు, మోసపోయారు.
అయితే, అది ఒక దెబ్బతో ముగిసింది. కానీ ఇప్పుడు పవన్ మాత్రం.. ఎన్నికలవారీగా.. అంటే ఐదేళ్లకు ఒకసారి ఇలా విడతలవారీగా పార్టీని టీడీపీకి తాకట్టుపెట్టేసి కేడర్‌ను, కాపులను మోసం చేస్తున్నారని వాపోతున్నారు. ఈ టిక్కెట్ల విషయంలో కూడా భారీగా డబ్బులు చేతులు మారినట్లు కేడర్‌లో అనుమానాలు ఉన్నాయ్. రాజ్యాధికారం సాధిస్తాం.. ఎవరివద్దా ఊడిగం చేయం అని మీటింగుల్లో గట్టిగా అరిచే పవన్ తానే ఏకంగా చంద్రబాబుకు లొంగిపోయి పార్టీని అప్పగించేశారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment