సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన అంశం.. ప్రత్యేక హోదా విషయం.. పార్టీ లతో పొత్తుల వ్యవహారం.. ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మాటలు మార్చుతూ రాజకీయాల్లో ‘యూ టర్న్’ నాయకుడిగా చంద్రబాబు ఎక్కువ ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు అచ్చు గుద్దినట్టు చంద్రబాబు మాదిరే రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్ రికార్డుల మోత మోగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు అన్ని అంశాలలోనూ ఎప్పటికప్పుడు మాట మార్చుతూ తాను ‘నయా యూ టర్న్’ నేతనని నిరూపించుకుంటున్నారు.
నలభై ఏళ్ల అనుభవంలో చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటే.. పార్టీ పెట్టి ఆరీ తీరీ పదేళ్లు కాకుండానే అన్ని పార్టీలతో పవన్ పొత్తులు పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు ఏ విషయంపై ఏం మాట్లాడుతారోనని రాజకీయ విశ్లేషకులే నిర్ఘాంతపోతున్నారు. గాలి వాటంగా వ్యవహరించే ఆయన ఎప్పుడు ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటారో కూడా ఎవరికీ అంతుపట్టడం లేదంటున్నారు.
పవన్ కేవలం ఒక్క వలంటీర్లకు సంబంధించిన అంశంలోనే కాదు.. అనేక సందర్భాల్లో అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట మార్చుతూ తనకు చాలా నాలుకలున్నాయని రుజువు చేస్తున్నారు. అమరావతి రాజధాని, కాపు రిజర్వేషన్ల అంశంతోపాటు అనేక కీలక అంశాలన్నింటిలోనూ జనసేనాని రాజకీయ వైఖరి పూర్తి యూ టర్న్ అన్న రీతినే సాగుతోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పుడు పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబుపై 2014లో ఒకలా, 2019లో మరోలా, ఇప్పుడు ఇంకోలా మాట్లాడారు. తన కుటుంబాన్ని, తన తల్లిని కించపరిచేలా మాట్లాడిన టీడీపీ నేతల సంగతి చెబుతానన్న పవన్.. ఇప్పుడు వారితోనే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు.
పవన్ నాలుక మడత ఇలా..
‘రాష్ట్రంలో మహిళల ఆదృశ్యాలకు వలంటీర్లే కారణం. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతి గ్రామంలో వలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఆ సమచారాన్ని కొంత మంది విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్లు కిడ్నాప్, ట్రాప్ చేస్తున్నారు. దీంతో మహిళలు ఆదృశ్యమవుతున్నారు. నాతో సాక్షాత్తూ కేంద్ర నిఘా వర్గాలే ఈ మాటలు చెప్పాయి.’ – 2023 జులై 10వ తేదీన పవన్
‘ఈ వలంటీర్ వ్యవస్థపై జనసేన కోర్టులో ఛాలెంజ్ చేస్తోంది. మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఛాలెంజ్ చేయాలి జగన్.. నీ ఇష్టం. సై అంటే సై.. తేల్చుకుందాం. దేనికైనా రెడీ. వలంటీరు అనే సమాంతర వ్యవస్థపై నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పకుండా, విచారణకు సిద్ధంగా ఉండాలని ప్రత్యేక జీవో ఇచ్చావ్. జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా సిద్ధం. అరెస్టు చేసుకోండి. చిత్రహింసలు పెట్టుకోండి. తప్పు జరిగితే కచ్చితంగా ఎత్తిచూపుతామని సవాల్ విసురుతున్నా’. – 2023 జులై 20న మరోసారి పవన్
‘ఆడపిల్లలు వైఎస్సార్‌సీపీ వలంటీర్ల వల్లే ఆదృశ్యమై పోయారని నేను అన్నానట.. ముఖ్యమంత్రి అంటున్నారు.. దానికి వివరణ ఇస్తున్నా. నేను చెప్పింది మీ వలంటీర్లు సమాచారం సేకరించడం వల్ల, ఆ డేటా ఎటెటో వెళ్లి పోయిందని చెప్పాను. అంతే తప్ప, ఏ రోజూ వలంటీర్లే అంతా చేశారని నేను అనలేదు. వాళ్ల మీద గౌరవం ఉంది. వలంటీర్ల వ్యవస్థను నేను తప్పు పట్టలేదు. వలంటీర్లుగా పని చేస్తున్న వారి భవిష్యత్ కోసం మేమందరం సంపూర్ణంగా పని చేస్తాం’ – 2024 ఫిబ్రవరి 15 తేదీన తాజాగా పవన్ పలుకులు
పవన్ నోట ఇంకా ఇలా..
♦ 2014 తర్వాత మందడంలో చంద్రబాబుతో కలిసి సంకాంత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ ‘అమరావతే ఆంధ్రప్రదశ్ రాజధాని. మన (టీడీపీ–జనసేన) ప్రభుత్వంలో ఇదే ప్రాంతంలో బంగారు రాజధానిని నిర్మించుకుందాం’
♦ ‘అమరావతి ఇన్‌క్లూజివ్ క్యాపిటల్ కాదు. కేవలం కొద్ది మంది కోసమే. అది టీడీపీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్‌లా ఉంది. ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి ఏమీలేని ఈ క్యాపిటల్‌కు రావాలంటే ఎంత ఇబ్బంది పడతారు? వాళ్లు ఇక్కడకు వచ్చి ఎలా స్థిరపడతారు?’ అని గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2018లో వ్యాఖ్యానించారు.
♦ 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చామా.. అని బాధపడుతున్నా. యువతకు ఉపాధి, ఆడపడుచులకు రక్షణ ఉంటుందని ఆశిస్తే అవేవీ టీడీపీ పాలనలో లేవు. ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులు చేయడంలోనే అభివృద్ధి చూపించారు.
♦ 2018 అక్టోబర్ 2న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సభలో ‘నాలుగేళ్లు రాష్ట్రానికి ఏం చేశారని మిమ్మల్ని మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి చంద్రబాబూ? మీరు చేసిన అద్భుతాలు ఇక చాలు. ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. ఉన్నవాటిని కూడా మూసేస్తున్నా పట్టించుకోవడం లేదు. మీ పాలన మాకొద్దని ప్రజలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు.’
♦ ‘దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాలవల్ల 2019లో టీడీపీకి మద్దతు ఇవ్వలేకపోయా. అందుకే ఇప్పుడు మద్దతు ఇస్తున్నా’ అని గత డిసెంబరు 20వ తేడీన లోకేష్ యువగళం ముగింపు యాత్రలో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment