తూచ్.. అధికారులు మా లీడర్ రావాల్సిన హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతించడం లేదు. ఇందుకు నిరసనగా మా పార్టీ అధినేత తన పర్యటన వాయిదా వేసుకుంటున్నాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదాపై జనసేన పార్టీ ఇచ్చిన వివరణ ఇది. అదనంగా.. అధికారుల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యకు దిగింది అంటూ విష ప్రచారానికి దిగారు. ఇది వాస్తవమేనా?..
ఎన్నికలకు పట్టుమని రెండు నెలలు కూడా లేదు. ఓవైపు అధికార పక్షం మార్పులు చేర్పులు చేసుకుంటూ.. అభివృద్ధి మంత్రతో దూసుకుపోతోంది. మరోవైపు ప్రతిక్ష టీడీపీ కూడా జనాల్లోకి వెళ్లేందుకు శాయశక్తుల కృషి చేస్తోంది. ఇక.. బీజేపీ సైతం వరుస భేటీలో హడావిడి చేస్తోంది. అంతెందుకు.. గత ఎన్నికల్లో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ సైతం కొత్త పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో ఏదో ఒక యాక్టివిటీతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మరి పదేళ్లు పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్ జనసేన సంగతి?
పార్టీ పెట్టినప్పుడు టీడీపీ-బీజేపీలకు మద్దతు ఇచ్చాడు. రెండో దఫా ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుగా పోటీ చేసి బొక్కా బొర్లా పడ్డాడు(137 స్థానాల్లో పోటీ చేస్తే.. నెగ్గింది ఒక్కటే సీటు). పోనీ.. ఈ ఐదేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలపర్చుకుంది ఏమైనా ఉందా? అంటే.. అదీ లేదు. అసలు వారాహి యాత్రను పవన్ కల్యాణ్ ఎందుకు మొదలుపెట్టాడు. ఎందుకు ఆపాడు? టీడీపీతో పొత్తు ప్రకటన ఎందుకు చేశాడు? అసలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని పదే పదే ఎందుకు కలుస్తున్నాడు?.. సీట్ల పంపకాన్ని ఇంకెప్పుడు తేలుస్తాడు?.. ప్రజలకే కాదు.. జనసేన కేడర్‌కు సైతం అంతుచిక్కని ప్రశ్నలివి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనాలకు దగ్గర అవుదామని ఆలోచన కూడా పవన్ చేయకపోవడాన్ని ఆ పార్టీ నేతలే తీవ్రంగా తప్పుబడుతున్నారు. హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతించలేదన్న సాకుతో.. భీమవరం పర్యటనను వాయిదా వేసుకోవడంపైనా ఇప్పుడు అదే తరహా చర్చ నడుస్తోంది.
అధికారులు చెప్పినా కూడా..
పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన కోసం హెలికాఫ్టర్‌ను ఉపయోగించుకోవాలనున్నారట. అది ఫర్వాలేదు. కానీ, అనువుగా లేని హెలిపాడ్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడంపైనే అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే జనసేన దానిని మరోలా ప్రచారం చేస్తోంది. ఆర్ అండ్ బి అధికారులు మోకాళ్ల అడ్డారంటూ అసత్య ప్రచారానికి దిగింది. దీనిపై అధికారులు స్పందిస్తూ.. విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలిపాడ్ ప్రాంతాన్ని 2018 నుండి అనుమతించడం లేదని గుర్తు చేస్తున్నారు. ‘‘హెలిపాడ్ ప్రాంతానికి 50 మీటర్ల దూరంలోనే అపార్ట్మెంట్లు ,చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో హెలిప్యాడ్ అనువు కాదు. ఏవియేషన్స్ నామ్స్ పాటించాలని జనసేన నేతలకు సూచించాం. అనువైన ప్రదేశాన్ని హెలిపాడ్‌గా ఎంపిక చేసుకోవాలని కూడా చెప్పాం కూడా అని ఆర్అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు అంత చెప్పినా.. జనసేన నేతలు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు.. సోషల్ మీడియాలో విష ప్రచారానికి దిగారు.
కారణం ఏంటసలు?
భీమవరం పర్యటన కోసం పవన్ హెలికాఫ్టర్‌లోనే వెళ్లాలా? రోడ్డు మార్గంలో తన కాన్వాయ్ గుండా వెళ్లొచ్చు కదా. గతంలో పవన్ ఏనాడూ ఇలా కారులో వెళ్లింది లేదా?. కేవలం హెలిపాడ్ అనుమతి నిరాకరణ కారణంతోనే పవన్ తన పర్యటన వాయిదా వేసుకున్నాడా?. ఇది సిల్లీగా పవన్‌కే అనిపించడం లేదా?.. కీలకమైన ఎన్నికల సమయంలో పవన్ తన పర్యటనను వాయిదా వేసుకోవడం వెనుక వేరే కారణం ఏదైనా ఉందా?...
ఢిల్లీ పర్యటనలో బీజేపీతో పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబు వెంటే వెళ్లిన పవన్.. అక్కడ మీడియాకు ముభావంగా కనిపించాడు. మీడియాతో పెద్దగా మాట్లాడకుండా వెళ్లిపోయాడు. ఇన్నిరోజులు గడిచినా ఢిల్లీ పరిణామాలపై ఇటు చంద్రబాబు, అటు పవన్ మాట్లాడింది లేదు. అదే సమయంలో పొత్తు పార్టీల ఉమ్మడి సమావేశం వాయిదా పడింది. అంటే.. అభ్యర్థుల ప్రకటనను సాగదీస్తూ పోతున్నారాన్నమాట. ఇంతలోనే పవన్ భీమవరం పర్యటన ఖరారైంది. దీంతో పవన్ మరోసారి అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం మొదలైంది. అయితే ఆ వెంటనే ఆ పర్యటనను కూడా వాయిదా వేసుకోవడం.. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో కూడా జనసేన స్పష్టత ఇవ్వకపోవడంతో.. ఏదో జరుగుతోందన్న విశ్లేషణ నడుస్తోంది ఇప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment