సాక్షి, మచిలీపట్నం, కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తొలుత విభజన సమస్యల పరిష్కార కమిటీ అజెండాలో చేర్చినప్పుడు ఏమాత్రం స్పందించని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు తొలగించగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు తహతహ లాడుతున్నారని మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. తన కోవర్టులను బీజేపీలో చేర్చి నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకుని కనీసం అదికూడా సాధించలేని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు. నాడు కేంద్ర మంత్రులుగా ఉన్న సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజుతో హోదా అవసరం లేదని అర్ధరాత్రి ప్రకటన చేయించారని గుర్తు చేశారు. మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో, గడికోట శ్రీకాంత్‌రెడ్డి కడపలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
నీచ రాజకీయాలొద్దు..
ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు ఒక్క రూపాౖయెనా తెచ్చారా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేయడంలో చంద్రబాబు మార్గదర్శకత్వంలో కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈర‡్ష్య, నీచ రాజకీయాలను కట్టి పెట్టాలని సూచించారు. విభజన అంశాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ అజెండాలో తొలుత చేర్చిన ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీలో చేరిన తన కోవర్టుల ద్వారా చంద్రబాబు తొలగింప చేశారని చెప్పారు.
సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే కదలిక
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విభజన సమస్యలను పరిష్కరించాలని కోరటాన్ని మంత్రి నాని గుర్తు చేశారు. ఇప్పటికే మూడేళ్లు ఆలస్యమైందని, ఏపీకి జరిగిన అన్యాయంపై దృష్టి సారించాలని ప్రధానిని సీఎం కోరారన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై స్పందించిన ప్రధాని అపరిష్కృత అంశాలకు సంబంధించి కమిటీని నియమించారని తెలిపారు.
ప్రతిపక్షం కాదు.. పనికిమాలిన పక్షం
టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరుకున్న కొందరు నాయకులు చంద్రబాబు అజెండాను అక్కడ అమలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.రాష్ట్రంలో ఉన్నది ప్రతిపక్షం కాదని, పనికిమాలిన పక్షమని «ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో పదేపదే ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావిస్తూ డిమాండ్‌ను సజీవంగా ఉంచారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment