నీ ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీకు జిరాక్స్ ఇచ్చారా పవన్?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై విషం గక్కుతున్న చంద్రబాబు
పక్క రాష్ట్రాల్లో మోదీపై విమర్శలు చేస్తే ఈసీ ఆంక్షలు విధిస్తుంది
ఇక్కడ సీఎం జగన్‌ని చంపేయండి అంటున్నా మిన్నకుంటుంది
మే 14 తర్వాత పథకాలు అమలు చేయండని తెలంగాణలో ఎందుకు చెప్పలేదు?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఆస్తిపత్రాలు ఎవరివద్ద ఉన్నాయని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చారా? అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు విషం గక్కుతున్నారని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో మోదీపై విమర్శలు చేస్తే ఈసీ ఆంక్షలు విధిస్తోందని, కానీ ఇక్కడ జగన్‌ని చంపేయండంటున్నా మిన్నకుంటుందని పేర్కొన్నారు.
మే 14 తర్వాత పథకాలు అమలు చేయండని తెలంగాణలో ఈసీ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రామోజీ, రాధాకృష్ణలు.. చంద్రబాబు కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారని, తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పారు. పవన్‌కళ్యాణ్‌ను వాడుకుని జగన్‌కి కాపులను దూరం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నాడని, దళితులను చీల్చడానికి మంద కృష్ణమాదిగను తెచ్చాడని, కానీ బీసీలను చీల్చుదామంటే వారు ప్రశ్నించడం మొదలు పెట్టారని వివరించారు.
ఎన్నిచేసినా పెద్ద గీత జగన్ పక్కన చంద్రబాబు చిన్న గీతగానే మిగిలాడని, ఇక ఏమీ చేయలేక భూములపై విషప్రచారం మొదలుపెట్టారని చెప్పారు. ఇవన్నీ ఆగాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
దుష్టచతుష్టయం కుటిల పన్నాగాలు ఫెయిల్
ఎన్నికలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పనితీరుపై జరగకూడదని రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ దుష్ట పన్నాగాలు పన్నారనేది స్పష్టం అవుతోంది. జగన్ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను చేపట్టిందని, అది దుర్మార్గమైన వ్యవస్థ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వలంటీర్ వ్యవస్థ పెద్ద మాఫియా అని, వలంటీర్లు అమ్మాయిలను రెడ్‌లైట్ ఏరియాకు అమ్మేస్తున్నారని పవన్‌కళ్యాణ్ మాట్లాడారు. ఏపీలో అమ్మాయిలు మిస్సయ్యారని, కేంద్ర నిఘావర్గాలు తనకు చెప్పాయని దుష్ప్రచారం చేశారు.
ఈ సంచులు మోసే వలంటీర్లు మగవాళ్లు ఇంట్లోలేని సమయంలో తలుపులు కొట్టి ఆడవాళ్లను లోబరుచుకుంటారని చంద్రబాబు మాట్లాడాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వలంటీర్ వ్యవస్థపై నీచంగా వార్తలు రాశాయి. కానీ ప్రజల్లో ఈ వ్యవస్థపై ఇసుమంతైనా నమ్మకం సడలలేదు. కోవిడ్ సమయంలో దేశంలోనే అత్యద్భుతంగా సేవలందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ హైదరాబాద్‌లో ఇళ్లల్లోంచి బయటకు రాలేదు. జగన్ ఇక్కడే ఉండి రూ.30 వేల కోట్లు కోవిడ్ కోసం ఖర్చుచేసి మందులు, వైద్యం అందించారు.
కులాలను వాడుకుని దెబ్బతీయాలని బోర్లా పడ్డారు
చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రానికి ఫలానా మేలు చేశానని చెప్పుకొనే పరిస్థితి ఉందా? చేసిందేమీ లేక కులాలను వాడుకుని జగన్‌ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడు. మహిళలనూ చీల్చుదామని చూశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.14 వేల కోట్ల రుణాలు బేషరతుగా మాఫీచేస్తానని, ప్రతి మహిళకు సెల్‌ఫోన్ కొనిస్తానని, పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.25 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. రాష్ట్రంలో ఉన్న సుమారు మూడు కోట్లమంది మహిళలు సీఎం జగన్‌కు అండగా ఉన్నారు.
2019 నుంచీ ఎవరి ఆస్తిపత్రాలు వారి వద్దే..
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై వదంతులు సృష్టించారు. ఈ యాక్ట్ 2019లోనే వచ్చింది. ఇప్పుడు 2024లో దానిగురించి మాట్లాడుతున్నారు. 2019లో చట్టం వస్తే.. ఇప్పటివరకు చంద్రబాబు కొనుక్కున్న ఆస్తుల కాగితాలు అతని వద్దే ఎందుకు ఉన్నాయి? పవన్‌కళ్యాణ్ ఈ ఐదేళ్లలో మూడో, నాలుగో ఆస్తులు కొన్నారని చెబుతున్నారు. మరి ఆయన కాగితాలు ఆయన వద్దే ఎలా ఉన్నాయి? ఈ రాష్ట్రంలోని టీడీపీ, జనసేన నాయకులు కొనుక్కున్న ఆస్తుల ఒరిజనల్స్ ఎవరివి వారివద్ద ఎందుకున్నాయి?
బరితెగించిన చంద్రబాబు
తప్పుడు ప్రచారంపై ఎన్నికల కమిషన్ కేసులు పెడితే.. చంద్రబాబు బరితెగించి ఫుల్‌పేజీ అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చారు. ఆయనకు వ్యవస్థలంటే లెక్కలేదు. రాష్ట్రంలోని 26 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటివరకు ఆరువేల గ్రామాల్లోనే సర్వే జరిగింది. అక్కడ టీడీపీ వారు లేరా? సర్వే సందర్భంగా ఒక్కరన్నా ఆరోపణలు చేశారా? అసెంబ్లీలో చట్టం చేసేటప్పుడు టీడీపీ సమర్థించింది. ఇప్పుడు ఎన్నికల కోసం విషం చిమ్ముతోంది. చంద్రబాబు బీసీ సర్టిఫికెట్ ఇస్తే.. దానిపై ఆయన బొమ్మ ఉంటే ఆ బీసీ.. కమ్మ ఆయిపోతారా? పాసు పుస్తకం లోపల తహసీల్దారు సంతకం ఉంటుంది. పైన ఫొటో ముఖ్యమా? లోపల సంతకం ముఖ్యమా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment