సాక్షి, అమరావతి: విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలంటూ ఉత్తరాంధ్ర ప్రజలు చేసిన గర్జన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగానే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ శనివారం అక్కడకు వెళ్లి రచ్చచేశారని మాజీమంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు. ‘చంద్రబాబు చేసిన కుట్రలో పావుగా విశాఖకు పోయి డ్రామాలు ఆడడం పాపం కాదా? ఉత్తరాంధ్ర ప్రజల ఉసురు మీకు తగలదా?’ అంటూ పవన్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రాత్రి, అంతకుముందు మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ ఉడత ఊపులకు తాను భయపడేది లేదంటూ పవన్ సినీఫక్కిలో డైలాగ్ కొట్టారంటూ ఎద్దేవాచేశారు. ‘మీ సినిమా డైలాగ్‌లకు, ఎవరో రాసిస్తే చెప్పే దబాయింపులకు వైఎస్సార్‌సీపీలో బాల కార్యకర్త కూడా భయపడడు’ అంటూ పవన్‌కు నాని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇక్కడే ఉంటా.. వైఎస్సార్‌సీపీని ఎదుర్కొంటా అంటూ పవన్ బీరాలు పలుకుతున్నారని.. ‘నువ్వొక్కడివే కాదు.. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కట్టకట్టుకుని రండి.. మేం ఇక్కడ వెయిటింగ్.. అందరూ కలిసొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు.
మూడేళ్ల నాలుగు నెలలుగా రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మరుగునపరిచి.. మీరు, చంద్రబాబు ఎన్ని పథకాలు రచించినా.. ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ వేసుకున్న బలమైన ముద్రను చెరపలేరు’.. అంటూ పవన్‌కు తేల్చిచెప్పారు. ‘సినిమాల్లో మాదిరిగా నువ్వొకటంటే మేం పది అంటాం’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇదే మాట చంద్రబాబుకు కూడా చెప్పండి’ అంటూ పవన్‌కు హితవు పలికారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..
మాట మార్చినందుకే ఉద్వేగం..
2019 ఎన్నికల ముందు వరకూ అమరావతి అసలు రాజధానే కాదని, అది ఒక కుల రాజధాని, అది అందరి రాజధాని కాదని.. పవన్‌కళ్యాణ్, లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ, సీపీఎం, సీపీఐ, బీజేపీకి సంబంధించిన ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఇవాళ వారు విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలులో హైకోర్టును వ్యతిరేకిస్తున్నామని మాటమార్చారు.
మరీ ప్రత్యేకించి డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్‌కు వెళ్లి తొడ గొట్టినట్లుగా అమరావతి నుంచి విశాఖకు వెళ్లి, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరంలేదని.. అంతా తమకే కావాలని తొడగొట్టే పరిస్థితి ఉంటే ఉత్తరాంధ్ర వారిలో భావోద్వేగం పెరగదా? ఉత్తరాంధ్ర మేధావులు జేఏసీ ఏర్పాటుచేసుకుని గర్జన కార్యక్రమానికి పిలునిస్తే.. దానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చింది. ఆ విషయం కూడా తెలియని పవన్ అధికారంలో ఉండి గర్జన ఏమిటి? అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనం.
మాట మార్చడానికి పవన్ ఐకాన్
పూటకో మాట, నెలకో మాట, ఏడాదికో మాట. ప్రతి ఎన్నికలప్పుడు ఒక్కో మాట. ఏ మాత్రం నిబద్ధత లేని, నిలకడలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క పవన్‌కళ్యాణ్ మాత్రమే. అందులో ఆయన నిష్ణాతుడు. నిలకడలేనితనానికి పవన్ ఓ ఐకాన్.
మంత్రులను పచ్చి బూతులు తిడతారా?
విమానాశ్రయం వద్ద జనసేన కార్యకర్తలు.. మంత్రులను పచ్చి బూతులు తిట్టారు. బీసీ మంత్రి రజనిని సిగ్గుతో చచ్చిపోయేలా తిట్టారు. మరో మహిళా మంత్రి రోజాను చంపడానికి ప్రయత్నించారు. జనసేన కార్యకర్తలు కర్రలతో దాడిచేస్తే రోజా వ్యక్తిగత సహాయకుడి బుర్ర పగిలి తొమ్మిది కుట్లుపడ్డాయి. దళిత మంత్రి నాగార్జున మీద చెప్పులు వేస్తారా? మరో బీసీ మంత్రి జోగి రమేష్‌పై దాడిచేస్తారా? ఇదేనా పవన్ సంస్కారం, జనసేన సంస్కృతి?
ప్రజలు ఇబ్బందుల్ని చెప్పడం తప్పా?
రోడ్ల మీద జనం అల్లాడుతున్నారు కాబట్టి, మీరు కారులో నేరుగా హోటల్‌కు వెళ్లమని పోలీసు అధికారులు చెబితే.. దాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపట్టడం విడ్డూరం. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించవద్దని చెబితే, దాన్ని కూడా తప్పుపట్టడం అవివేకం. ఇక రాళ్లు వేయడం తప్పుకాదని ఎవరో పతిత చెప్పాడని పవన్ అన్నాడు. పవన్ సిగ్గు విడిచి, బరితెగించి మాట్లాడుతున్నాడు. తమ పార్టీ కార్యకర్తను ౖజైలులో కొట్టారని పవన్ అంటున్నాడు. మళ్లీ ఆయనే చెప్పాడు.. తమ పార్టీ వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకువచ్చానని. అవేం పొంతనలేని మాటలు.
అట్టుకు పది అట్లు పెడతాం..
తాను విధానపరమైన విమర్శలు చేస్తానని పవన్ చెప్పాడు. సీఎం వైఎస్ జగన్‌పై, మాజీమంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి అంబటి రాంబాబు గురించి, నా గురించి మాట్లాడినవి విధానపరమైనవా? వ్యక్తిగతమైనవా? గతంలో చలమలశెట్టి సునిల్, రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు, కాకినాడ రూరల్‌లో కన్నబాబు, భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గురించి మాట్లాడింది విధానపరమైందా? వ్యక్తిగతమైందా? ప్రజలకు ఏవీ గుర్తులేవనుకుంటున్నారా? ఇది సినిమా కాదు. నీవు డైలాగ్ చెబితే, తంతే పడిపోవడానికి. ఇది వైఎస్సార్‌సీపీ.. అట్టుకు పది అట్లు పెడతాం. వాయినానికి 10 వాయినాలు ఇస్తాం.
వికేంద్రీకరణ అంటే..
ఇక 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి ముక్కలు ముక్కలు చేశారని పవన్ అవివేకంగా మాట్లాడారు. ఆ నిర్ణయంవల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. చివరకు పవన్ పార్ట్‌నర్ చంద్రబాబు కూడా తన నియోజకవర్గ కేంద్రం కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయమని కోరుతూ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఇక చంద్రబాబు బావమరిది బాలకృష్ణ హిందూపురంను జిల్లా కేంద్రం చేయమని కోరారు.
హత్యాయత్నం చేస్తే చర్యలు తీసుకోవద్దా?
ఎయిర్‌పోర్టులోకి వచ్చి గొడవలు చేసి, హత్యాయత్నం చేస్తే, పోలీసులు ఊరుకుంటారా? గతంలో ఒక పేపర్‌లో మీ మీద వార్త రాస్తే, రివాల్వర్‌తో ఆ పత్రిక ఆఫీస్‌కు వెళ్లి బెదిరించావా? లేదా? ఆ స్వేచ్ఛ నీకు ఉన్నప్పుడు.. ఏకంగా మంత్రుల మీద హత్యాయత్నం చేస్తే, పోలీసులను ఏం చర్యలు తీసుకోవద్దని ఎలా అంటావు? అలాగే, రూ.3 వేల పెన్షన్ అడిగితే బెదిరిస్తున్నామని పవన్ పచ్చి అబద్ధాలు చెప్పాడు. పవన్.. ఎవరు పెన్షన్ ఆపాలనుకున్నా ఈ ప్రభుత్వంలో కుదరదు. జగన్ పాలన అలా సాగుతోంది.
చంద్రబాబు హయాంలో ఎందరి పెన్షన్లు తొలగించారో లెక్కలు.. అప్పటి, ఇప్పటి పెన్షన్ల సంఖ్య, ఇస్తున్న మొత్తం ఎంతో చూసుకోండి. పోలికే ఉండదు. మరోవైపు.. గొప్ప ఛానళ్లు తనను బలపర్చమని పవన్ కోరుతున్నాడు. అంటే ఆయనకు అవసరం వచ్చినప్పుడు వారి సహకారం కావాలన్న మాట. నిజానికి..పవన్ ఇచ్చేది రూ.60 లక్షల చెక్కులు. అది కూడా ఇన్సూరెన్ప్ కంపెనీలు ఇచ్చేవే. దానికోసం స్పెషల్ ఫ్లైట్స్. వాటికి ఎంత ఖర్చవుతుంది? దానికి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు?
2024లోనూ వైఎస్సార్‌సీపీదే విజయం
2014 ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలని పవన్ కోరారు. 2019లో టీడీపీకి ఓటేయొద్దని అన్నారు. అంటే పరిపక్వతలేని నిర్ణయాలు తీసుకునేది పవన్. మీరు, ఎల్లో మీడియా, చంద్రబాబు ఎంత విషం చిమ్మినా ప్రజలు తమ గుండెల్లో వైఎస్ జగన్‌కు స్థానం ఇచ్చి 2019లో ఘన విజయాన్ని అందించారు. 2024లో కూడా అదే జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment