జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి
టీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడి
ఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారు
పారిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డి
నేను ఎక్కడికి పారిపోలేదు..
ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వచ్చా
ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సాక్షి, పల్నాడు: ‘టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం..’ అని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని పిన్నెల్లి ప్రకటించారు. ఆయన మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది.
ఏడు మర్డర్ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపోయాడు. ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబాబు తీసుకొచ్చి పల్నాడులో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండలంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంటచింతల మండలంలో తుమృకోట, పాలవాయిగేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టించారు.
కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతాయని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించుకోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీసుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారిపోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు.
టీడీపీని గెలిపించేందుకు సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment