
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ పార్టీ అంటే తమ పార్టీ అని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట తాను మొదటి నుంచీ నడిచిన వ్యక్తినని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం సీఎం వైఎస్‌జగన్‌తో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌లో సామాజిక సమీకరణలో భాగంగా సీఎం జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. అందువల్ల సీనియర్లకు అవకాశం రాలేదని చెప్పారు.
తమ టార్గెట్ 2024 ఎన్నికలు అని, దానికోసం ఏ బాధ్యత ఇచ్చినా పూర్తిస్థాయిలో పని చేస్తానని ఎమ్మెల్యే పిన్నెల్లి తెలిపారు. పార్టీ కోసం దేనికైనా సిద్ధమని, తనకు ఏ హామీ ఇవ్వలేదని తెలిపారు. హామీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తనకు బీ ఫామ్ ఇవ్వబట్టే ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తుచేశారు. ఆయన ఏమి చేసినా పార్టీ మంచి కోసమే చేస్తారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎవరికీ అన్యాయం చేయరని, అందరూ పార్టీ కోసం పని చేయాల్సిందేని చెప్పారు.
అంతకు ముందు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంత్రి పెద్దిరెడ్డిని కలిశారు. ఈ క్రమంలో మంత్రి పదవి రాలేదని తనకు ఎలాంటి అసంతృప్తి లేదని తెలిపారు. పార్టీనే మాది.. అసంతృప్తి ఎక్కడుంటుందని వ్యాఖ్యానించారు.
చదవండి: జగన్ సీఎం కంటే నాకేదీ ముఖ్యం కాదు: ఎమ్మెల్యే రాచమల్లు