మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం. వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలి. కైలాసం ఆటలో పెద్దపాము మింగిన కథ అయితది జాగ్రత్త. తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలి. – కేసీఆర్
వేగంగా పురోగమిస్తున్న తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన శత్రువుగా మారారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని జీర్ణించుకోలేక అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రైతులకు ఉచిత కరెంట్ ఇయ్యొద్దట. మోటార్లకు మీటర్లు పెట్టాల్నట. సింగరేణి బొగ్గున్నంక కూడా మోదీ చెప్పిన సావుకార్ల కాడ కొనాల్నట. కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెట్టాల్నట..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రగతి రోజురోజుకూ దిగజారుతోందని, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, నిరుద్యోగమూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఇవాళ పెట్రోల్ ధర ఎంత, గ్యాస్ సిలిండర్ ధర ఎంత? ఇవన్నీ ప్రశ్నించినందుకేనా తెలంగాణపై కుట్ర చేస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి..’ అంటూ ప్రజలను కోరారు. కేంద్రంలో రాష్ట్రాల సంక్షేమం చూసే ఉత్తమ ప్రభుత్వం రావాలని, అందుకోసం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని పిలుపునిచ్చారు. మళ్లీ మోసపోతే గోస పడతామని, ఈ దుర్మార్గులు, దుష్టశక్తులకు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం వికారాబాద్‌లో నూతన కలెక్టరేట్, సమీకృత కార్యాలయ భవనాన్ని, టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
నెత్తికి రుమాలు కట్టుకొని గాలిమాటలు చెప్పిండు
‘నిన్నటి ప్రధాని ప్రసంగంలో (స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా) పస ఏమీ లేదు. ప్రధాని ఏదో చెబుతారని దేశ ప్రజలు ఎదురుచూశారు. కానీ నెత్తికి రుమాలు కట్టుకుని గాలి మాటలు చెప్పిండు. భవిష్యత్తులో ఉజ్వల భారతదేశం నిర్మాణం దిశగా మనం కంకణ బద్ధులం కావాలి. లేకుంటే సమాజం వెనుకబడతది. సమైక్య పాలనలోని బాధలు మళ్లీ రావద్దంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. విద్యుత్ సంస్కరణల పేరుతో మీటర్లు పెట్టి, రైతులకు కేంద్రం శఠగోపం పెడుతోంది. మనకు ఉచిత కరెంటు ఉండాల్నా.. వద్దా? మీరే చెప్పండి..’ అని సీఎం ప్రశ్నించారు.
మోసపోతే.. గోస పడుతం
‘మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం. వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలి. కైలాసం ఆటలో పెద్దపాము మింగిన కత అయితది జాగ్రత్త. తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలి. 14 ఏండ్ల పాటు పోరాటం చేసి, చావు అంచుదాకా పోయి తెలంగాణ తెచ్చుకున్నం. ఇప్పుడు తెలంగాణలో మంచినీళ్లు, కరెంటు బాధ లేదు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచి నీళ్లిస్తున్నం. అన్ని రంగాలకూ 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. 26 లక్షలకు పైగా మోటార్లకు ఉచిత కరెంటు ఇస్తున్నం. దేశంలోనే అత్యధికంగా గురుకులాలు ఏర్పాటు చేసుకున్నం. ఐటీ, పారిశ్రామిక రంగాలను గొప్పగా అభివృద్ధి చేసుకున్నం. తెలంగాణ ఆదాయం అద్భుతంగా పురోగమిస్తున్నది. కానీ కేంద్రంలో ఉన్నవాళ్లు అడుగడుగునా అడ్డుపడుతున్నరు. నేడు ప్రధానమంత్రే మనకు శత్రువు అయిండు. ఎన్ని అడ్డంకులెదురైనా పరిగి, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాలకు సాగు నీళ్లందిస్తాం..’ అని హామీ ఇచ్చారు.
భూముల రేట్లు పడిపోతాయన్నారు..
‘తెలంగాణ వస్తే భూములు రేట్లు పడిపోతాయని అపోహ సృష్టించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాటి సమైక్యవాద తొత్తులు తెలంగాణకు అడ్డు పడ్డరు. కానీ నేడు తెలంగాణ వచ్చినంక, భూముల రేట్లు విపరీతంగా పెరిగినయి. ఉద్యమ సమయంలోనే వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేస్తా అని చెప్పిన. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నం. తెలంగాణ రాకపోతే వికారాబాద్ జిల్లా ఏర్పాటు అయ్యేదా? వికారాబాద్‌కు మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ వచ్చేవా?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు
‘ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నం. వ్యవసాయానికి ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ తదితర అనేక పథకాలను అమలు చేయాలని పక్క రాష్ట్రాల ప్రజలు కూడా కోరుతున్నరు. గూడు చెదిరి చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిన రైతులను కాపాడుకోవాలనే సంకల్పం తీసుకొని అనేక రైతు కార్యక్రమాలను అమలు చేస్తున్నం. రైతు బంధు పథకంతో ఎకరాకు ఏటా రూ.10 వేల సాయం అందిస్తున్నం. ఒక గుంట భూమి ఉన్న రైతు దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్నం. నేరుగా వారి ఖాతాల్లోనే పడుతున్నయి. భవిష్యత్తులో రైతులకు ఇంకా ఎంతో చేస్తం. ప్రపంచంలోనే రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు లేవు. ప్రజలు ఆలోచించాలె.. చర్చ పెట్టాలె..’ అని కోరారు.
కర్ణాటక పోయి చూడండి
‘పక్క రాష్ట్రం కర్ణాటక పోయి చూడండి. ఎట్లున్నదో తెలుస్తది. అక్కడి పరిస్థితి ఏంది.. ఇక్కడి పరిస్థితి ఏందో తెలుస్తది. వికారాబాద్‌లో ఇంతమంచి కలెక్టరేట్ భవనం వస్తదని అనుకున్నమా? 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇస్తున్నం. ఇందుకేనా కేసీఆర్ బస్సుకు బీజేపీ వోళ్లు జెండాలు అడ్డం పెట్టేది?..’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment