PM Modi Full Speech on the No Confidence Motion 2023 in Lok Sabha - Sakshi
Sakshi News home page

మణిపూర్‌ శాంతికి నాదీ హామీ.. ఈ పాపం కాంగ్రెస్‌ది కాదా? అవిశ్వాసం చర్చలో ప్రధాని మోదీ

Published Thu, Aug 10 2023 6:10 PM | Last Updated on Thu, Aug 10 2023 9:04 PM

PM Modi Full speech on the no confidence motion 2023 in Lok Sabha - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఐదేళ్లు గడువిచ్చినా.. ప్రతిపక్షాలు అవిశ్వాసానికి సిద్ధం కాలేకపోయాయని, నో కాన్ఫిడెన్స్‌.. నో బాల్‌గానే మిగిలిపోయింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మణిపూర్‌ అంశంపై విపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా గురువారం సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించారాయన.  ఈ మోషన్‌ మీద మీ చర్చ ఎలా జరిగింది?.. చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతీ మాట దేశం మొత్తం వింది. సోషల్‌ మీడియాలో దీనిపై ఏమని చర్చించారో తెలుసా?.. ‘విపక్షాలు ఫీల్డింగ్‌ చేస్తుంటే.. ఫోర్లు, సిక్సర్‌లు మా నుంచి పడ్డాయి’ అని మోదీ ఛలోక్తులు సంధించారు.

మా గెలుపును నిర్ణయించేశారు
దేవుడే ఎంతో దయ గలవాడు. ఏదో ఒక విధంగా మాట్లాడాలని చూస్తాడు. దేవుడి దయతోనే విపక్షాలు అవిశ్వాసం పెట్టాయని నమ్ముతున్నా.  2018లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా నేను చెప్పాను, ఇది మాకు బలపరీక్ష కాదు, వారికి బలపరీక్ష అని. ఫలితంగా వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల అవిశ్వాసం మాకు ఎప్పుడూ అదృష్టమే. ఈ రోజు మీరు మీరు (ప్రతిపక్షం) చేసిన పని మా గెలుపును నిర్ణయించేసింది. 2024 ఎన్నికల్లో ఎన్డీయే, బీజేపీ గొప్ప విజయం సాధిస్తాయని, మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొడతాయని.. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తాయని ఒక అభిప్రాయానికి వచ్చేశా. 

భారత్‌ ఎదుగుదలను ప్రపంచం చూస్తోంది
అవిశ్వాసం, అహంకారం విపక్షాల నరనరాల్లో నిండిపోయింది. భారత్‌ను అప్రతిష్టపాలు జేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. మేం దేశ ప్రతిష్టతను ఖండాంతరాలకు వ్యాపింపజేశాం.  స్కామ్‌లు లేని భారత్‌ను అందించాం. ఫలితంగానే.. భారత్‌పై ప్రపంచ దేశాల్లో ఒక నమ్మకం ఏర్పడింది.  దేశం ఎంత బలపడిందో చెప్పేందుకు విదేశీ పెట్టుబడులే నిదర్శనం. మన సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్‌ ప్రశంసించింది. భారత్‌ నలుమూలలా విస్తారంగా అవకాశాలు దక్కుతున్నాయి. భారత్‌ ఎదుగుదలను ప్రపంచం చూస్తోంది. 

భారత్‌లో ప్రణాళిక, కృషి కొనసాగింపు కొనసాగుతుంది. అవసరాన్ని బట్టి దానికి కొత్త సంస్కరణలు ఉంటాయి. పనితీరు కోసం అన్ని ప్రయత్నాలు చేయబడతాయి. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. మీరు 2028లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినప్పుడు, ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలో దేశం ఒకటిగా ఉంటుందని దేశం విశ్వసిస్తోంది అంటూ ప్రధాని మోదీ విపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.


కోల్‌కతా నుంచి ఫోన్‌ వచ్చిందా?
ఈ అవిశ్వాసంతో మునుపెన్నడూ చూడనివి, కొత్తవి, ఊహించలేనివి చూస్తున్నాం. ఫ్లోర్‌ లీడర్‌ అధిర్‌ రంజన్‌ మాట్లాడకపోవడం విడ్డూరం. ఆయన్ని కాంగ్రెస్‌ ఎందుకు మాట్లానివ్వలేదు. బహుశా కోల్‌కతా నుంచి ఫోన్‌ వచ్చిందేమో. కాంగ్రెస్‌ ఆయన్ని పదే పదే అవమానిస్తూ వస్తోంది. అందుకే ఆయన్ని పక్కనపెడుతోంది. 

అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి.   తమ విధానాలతో దేశం కంటే పార్టీనే ముఖ్యమని కొన్ని విపక్ష పార్టీలు చాటి చెబుతున్నాయి.  బహుశా మీకు దేశంలోని పేదల ఆకలితో పట్టింపులేదేమో. ఎందుకంటే వాళ్లకు అధికార దాహమే ఆలోచనగా ఉండిపోయింది కాబట్టి.  

ఎల్‌ఐసీపై దుష్ప్రచారం చేశారు
అనరాని మాటలు అనడంతో విపక్షాల మనస్సులు శాంతించి ఉంటాయి. భారత్‌లో జరిగిన మంచిని విపక్షాలు సహించలేకపోతున్నాయి. HAL దివాళా తీస్తుందని ప్రచారం చేశారు. కానీ, హెచ్‌ఏఎల్‌ సరికొత్త రికార్డులు సృష్టించింది. అత్యధిక ఆదాయం అర్జించింది.  ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ చేస్తే నాశనం అవుతుందని, దివాళ తీస్తుందని ప్రచారం చేశారు. ఎల్‌ఐసీ ప్రైవేటీకరణతో పేదల డబ్బులు పోతాయని ప్రచారం చేశారు. కానీ, ఎల్‌ఐసీ పటిష్ట స్థితిలో ఉంది. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ప్రచారం చేశారు.  రాబోయే రోజుల్లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంటుంది అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌పై ప్రజలకు నో కాన్ఫిడెన్స్‌
కాంగ్రెస్‌కు ఎలాంటి విజన్‌ లేదు. నిజాయితీ లేదు. కాంగ్రెస్‌కు అంతర్జాతీయ ఆ‍ర్థిక విధానం లేదు. కాంగ్రెస్‌ హయాంలో దేశం పేదరికంలో మగ్గిపోయింది. కశ్మీర్‌పై, కశ్మీర్‌ ప్రజలపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదు. తమిళనాడులో 1962లో, త్రిపురలో 1988లో, నాగాలాండ్‌లో 1988లో చివరిసారిగా నెగ్గారు. తమిళనాడు భారత్‌లో భాగం కాదన్నట్లు మాట్లాడుతున్నారు. ఢిల్లీ, ఏపీలోనూ ప్రజలు కాంగ్రెస్‌ను దూరం పెట్టారు. యూపీ, బీహార్‌, గుజరాత్‌ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు.  అధికారం  కాంగ్రెస్‌కు అహంకారంతో కళ్లు మూసుకుపోయాయి. అందుకే అన్ని రాష్ట్రాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రజలు కాంగ్రెస్‌పై నో కాన్ఫిడెన్స్‌ ప్రకటించారు. విపక్షాలకు పాకిస్తాన్‌ అంటే ప్రేమ కనిపిస్తోంది. పాక్‌ చెప్పిందే విపక్షాలు నమ్ముతున్నాయి. పాక్‌ భూభాగంలోకి వెళ్లి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేశామంటే సైన్యాన్ని సైతం కాంగ్రెస్‌ నమ్మలేదు. మేక్‌ ఇన్‌ ఇండియా అంటే ఎగతాళి చేశారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌పై విపక్షాలకు నమ్మకం లేకుండా పోయింది.

ఇండియా కూటమిపై సెటైర్లు
విపక్షాలు కొన్నిరోజుల కిందట బెంగళూరులో యూపీఏకి అంత్యక్రియలు జరిపాయి. ఇన్ని తరాలు గడిచినా.. పచ్చి మిర్చి, ఎండు మిర్చికి తేడా తెలియని రీతిలో ఉంది మీ తీరు.  విపక్షాలు చివరకు ఇండియాను.. I.N.D.I.Aగా ముక్కలు చేశారు. తమను తాము బతికించుకోవడానికి ఎన్డీయే మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి వారిది. NDAలో రెండు ఐ(I లెటర్లు)లు చేర్చారు. మొదటి I.. 26 ;పార్టీల అహకారం. రెండో I.. ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనం. అలవాటు లేని ‘నేను’(I) అనే అహంకారం వారిని వదలడం లేదు. ఈ క్రమంలో ఎన్డీయేను కూడా దోచుకున్నారు.

ప్రతీ పథకం పేరు కాంగ్రెస్‌ ఒక కుటుంబం పేరును చేర్చింది. అక్కడ స్కీమ్‌లు లేవు. అన్నీ స్కామ్‌లే. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు గాంధీ పేరును వాడుకున్నారు. తమ పేర్ల మీద పథకాలు నడిపించారు. కాంగ్రెస్‌కు కుటుంబ పాలన, దర్బార్‌ పాలన అంటేనే ఇష్టం. వారి కుటుంబం నుంచి కాకుండా వేరే కుటుంబం నుంచి ప్రధాని అయితే సహించలేరు. మేం కుటుంబ పాలనకు వ్యతిరేకం. విపక్షాలది ఇండియా కూటమి కాదు..  అహంకారుల కూటమి. ఫెయిల్డ్‌ ప్రాజెక్టును కాంగ్రెస్‌ పదేపదే  లాంచ్‌ చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ఇండియా కూటమిలో ప్రతీ ఒక్కరిదీ ప్రధాని కావాలనే కోరిక. 

ప్రజలే దేవుళ్లు.. తీర్పు ఇచ్చారు
లంక దహనం జరిగింది హనుమాన్‌ వల్ల కాదు. రావణుడి అహంకారం వల్లే!. ప్రజలు కూడా రాముడి లాంటివాళ్లు. అందుకే 400 నుంచి మిమ్మల్ని 40కి పడేశారు. ప్రజలు రెండుసార్లు పూర్తి మద్దతు మాకు ఇచ్చారు. కానీ, మీకు ఓ పేద వ్యక్తి ఎలా ఇక్కడికి ఎలా వచ్చాడనే ఆలోచన మీకు నిద్రపట్టనివ్వడం లేదు.  ప్రజలు 2024లోనూ మిమ్మల్ని నిద్రపోనివ్వరు. ఒకప్పుడు విమానాల్లో కేక్‌ కట్టింగులు జరిగాయి. కానీ, ఇప్పుడు అవే విమానాల్లో పేద ప్రజల కోసం వ్యాక్సిన్‌లు పంపుతున్నాం. 

వారికి కలలో కూడా మోదీ కనిపిస్తాడు. 24 గంటలు మోదీ నామస్మరణ చేస్తారు. విపక్షాలు కొత్త కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. కాంగ్రెస్‌ది అబద్ధాల దుకాణం. త్వరలో ఆ దుకాణానికి కూడా తాళాలు వేయాల్సి వస్తుంది.  దేశంలోని వ్యవస్థలన్నీ చచ్చిపోయానని వీళ్లు అంటున్నారు. కానీ, అవేంతో అదృష్టం చేసుకుని ఉన్నాయి. దేశానికి, ప్రజాస్వామ్యానికి వాళ్లు శాపనార్థాలు పెడుతున్నారు. కానీ, మన దేశం, ప్రజాస్వామ్యం మరింత బలపడతాయి. అలాగే.. మేం కూడా మరింత బలోపేతం అవుతాం. 

విపక్షాలపై ప్రధాని విసుర్లు కొనసాగుతుండగానే.. ఇండియా కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. 


మణిపూర్‌పై.. 
మణిపూర్‌ అంశంపై ప్రతిపక్షాలకు అర్థవంతమైన చర్చ జరిపే ఉద్దేశం లేదు. మేం చర్చలకు ఆహ్వానించినా.. వాళ్లు రావడం లేదు. ఎందుకంటే మణిపూర్‌పై చర్చ విపక్షాలకు అవసరం లేదు. మణిపూర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందటారు. వాళ్ల మనసులో ఏదుంటే అదే కనిపిస్తుంది.. అదే బయటపడుతోంది. కొందరు భారతమాత చావు ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. భారతమాతను ముక్కలు చేసింది వీళ్లే. వందేమాతరం కూడా ముక్కలు ముక్కలు చేసింది కూడా వీళ్లే. కాపాడాల్సిన వాళ్లే భారతమాత భుజాలు నరికేశారు. తుక్‌డే గ్యాంగ్‌ను ప్రొత్సహిస్తున్నారు. 1966లో మిజోరాం ఘటనలకు కారణం ఎవరు? మిజోరాంలో సామాన్యులపైనా దాడులు చేయించారు. ఎయిర్‌ఫోర్స్‌ను ఉపయోగించారు. నెహ్రూపై లోహియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈశాన్య భారతంను చీకట్లో ఉంచేశారని లోహియా అన్నారు.  మిజోరాం వాస్తవాన్ని కాంగ్రెస్‌ దేశ ప్రజల ముందు ఉంచింది. ఈశాన్య రాష్ట్రంలో 50సార్లు పర్యటించాను. మా ప్రభుత్వ హయాంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అలాంటిది ఈశాన్య రాష్ట్రాల గురించి వీళ్లా మనకు చెప్పేది. 

మణిపూర్‌లో సాయంత్రం నాలుగు తర్వాత గుడిలు, మసీదులు మూసేవారు. ఈ పాపం కాంగ్రెస్‌ది కాదా? అని నిలదీశారాయన. మణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌లో అభివృద్ధిని కాంగ్రెస్‌ ఓర్వలేకపోతుందని మండిపడ్డారాయన. 

హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్‌లో పరిస్థితులు మారాయి. హైకోర్టు తీర్పులో రెండు కోణాలు ఉన్నాయి. మణిపూర్‌లో జరిగింది దిగ్భ్రాంతికరం. రాబోయే కాలంలో మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని నేను అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నాను. నిందితులకు కఠిన శిక్ష పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయి. దేశం మీ వెంట ఉందని అక్కడి ఆడపడుచులు, బిడ్డలకు నేను చెప్పాలనుకుంటున్నా. ‘యావత్‌ దేశం మీ వెంట(మణిపూర్‌ ప్రజలను ఉద్దేశించి..) ఉందమ్మా’. మణిపూర్‌ త్వరలో ప్రగతి పథంలో పయనిస్తుంది. మణిపూర్‌ అభివృద్ధికి అన్నివిధాలుగా అండగా ఉంటాం. 

ప్రపంచానికి ఈశాన్య రాష్ట్రాన్ని దిక్సూచిని చేస్తాం. మన నుంచి ప్రజలు మంచి ఆశిస్తారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి. 2047 నాటికి భారత్‌ అభివృద్ధిచెందిన దేశంగా ఉంటుంది. మరోసారి అవిశ్వాసం పెట్టేముందు సరిగ్గా ప్రిపేర్‌ అవ్వండి అంటూ విపక్షాలకు చురకలంటించారాయన. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement