బెంగుళూరు పర్యటన.. సీఎం రాకపోవడంపై స్పందించిన మోదీ | PM Modi Says I Requested Karnataka CM, Deputy CM Not To Come Amid Protocol Row - Sakshi
Sakshi News home page

ప్రధాని బెంగుళూరు పర్యటన.. సీఎంని రావొద్దని నేనే చెప్పా: మోదీ

Published Sat, Aug 26 2023 2:48 PM | Last Updated on Sat, Aug 26 2023 3:43 PM

PM Modi Says I Requested Karnataka CM Deputy CM Not To Come - Sakshi

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నేడు నేరుగా బెంగుళూరు చేరుకొని భారత్‌ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 ప్రాజెక్టు విజయానికి కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందించారు. చంద్రుడిపై ల్యాండర్‌ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్‌గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు.  ఈ సందర్భంగా జాబిల్లిపై ల్యాండర్‌ తీసిన తొలి ఫోటోను ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ మోదీకి బహుమతిగా అందించారు. అనంతరం ప్రధాని ఢిల్లీకి పయనమయ్యారు.

తాజాగా ప్రధాని బెంగళూరు పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. అయితే బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ హాజరుకాలేదు. ప్రధాని మోదీ సీఎంను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచి, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. 

దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తనకంటే ముందు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంతో ప్రధాని చాలా చిరాకుగా ఉన్నారు. అందుకే ప్రోటోకాల్‌కు విరుద్ధంగా వాళ్లను విమానాశ్రయంలో ఆహ్వానించకుండా దూరం పెట్టారు. ఇది చిల్లర రాజకీయం తప్ప మరొకటి కాదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రయాన్-1 ను విజయవంతంగా ప్రయోగించిన వేళ.. 2008 అక్టోబర్ 22న అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌ను నాడు గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీ మోదీ సందర్శించారు. ఈ విషయం ఇప్పటి ప్రధాని మర్చిపోయారా?’’ అంటూ జైరామ్ రమేష్‌ ప్రశ్నించారు.
చదవండి: చంద్రయాన్ 3 విజయోత్సవాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం..

అయితే కాంగ్రెస్‌ ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగళూరుకు తాను సరిగ్గా ఏ సమయానికి చేరుకుంటారో స్పష్టత లేని కారణంగా మంత్రులకు ఇబ్బంది కలిగించకూడదని భావించినట్లు తెలిపారు. బెంగుళూరు ఎయిర్‌నపోర్టుకు చేరుకున్న తర్వాత ప్రజలను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘నేను శాస్త్రవేత్తలతో సమావేశమైన తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళతాను. 

బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటానన్నది నాకు తెలియదు. కాబట్టి వారు రావద్దని నేనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, గవర్నర్‌కు చెప్పాను. నాకు స్వాగతం పలికేందుకు ముందుగా వచ్చి ఇబ్బంది పడొద్దని కోరాను. ప్రోటోకాల్ పాటించకుండా ఉండమని నేనే వారిని అడిగాను.’’ ప్రధాని పేర్కొన్నారు.


ఈ వివాదంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రధానిని స్వీకరించేందుకు తానును, సీఎం సిద్ధరామయ్య సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తనకు అధికారిక సమాచారం వచ్చిందని,  దానిని గౌరవించాలని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement