డెహ్రాడూన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు నష్టపోయినా లెక్కలేదు.. కేవలం దళారులు లాభపడాలన్నదే ప్రతిపక్షాల ఉద్దేశమని మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ భవనం సమీపంలోనే ట్రాక్టర్‌ను ప్రతిపక్ష కార్యకర్తలు దహనం చేయడం రైతన్నలను అవమానించడమేనని చెప్పారు. ‘రైతుల స్వేచ్ఛను వారు (ప్రతిపక్షాలు) వ్యతిరే కిస్తున్నారు. రైతాంగం సమస్యలు ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నారు. వ్యవసాయంలో ఉపయోగించే ట్రాక్టర్‌కు నిప్పు పెట్టడం ద్వారా మన రైతులను తీవ్రంగా అవమానించారు’అని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలు సమాజానికి దూరం
నమామీ గంగా మిషన్‌లో భాగంగా ఉత్తరా ఖండ్‌లోని హరిద్వార్, రిషికేశ్, ముని–కి–రేతి, బద్రీనాథ్‌లో రూ.500 కోట్లతో నిర్మించిన ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లను(ఎస్టీపీ) ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన..ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని విమర్శిం చారు. నాలుగు తరాలపాటు అధికారం అనుభవిస్తూ ప్రజలపై స్వారీ చేసిన ఓ పార్టీ(కాంగ్రెస్) అధికారంలో కోల్పోవడంతో నిరాశకు లోనవుతోందని, అందుకే ప్రతి అంశాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుందని ప్రధాని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment