న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో సభలో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై సస్పెండైన 8 మంది విపక్ష ఎంపీలు తమ నిరవధిక నిరసనను మంగళవారం విరమించారు. ఈ రాజ్యసభ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల పక్షాన పార్లమెంటు వెలుపల పోరాటం చేస్తామన్నారు. నిరవధిక దీక్షలో భాగంగా సోమవారం రాత్రి అంతా వారు పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దనే గడిపారు. అర్ధరాత్రి దాటాక కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, పాటలతో హోరెత్తించారు. నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ నేత జయాబచ్చన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, శశి థరూర్ వారిని కలిసి సంఘీభావం తెలిపారు. పార్లమెంటు చరిత్రలో రాత్రంతా ఆ కాంప్లెక్స్‌లోనే నిరసన దీక్ష జరపడం ఇదే ప్రథమమని పలువురు వ్యాఖ్యానించారు.
ప్రచారం కోసమే..
హరివంశ్ ప్రచారం కోసమే దీక్ష జరుగుతున్న ప్రదేశానికి వచ్చారని, తనతో పాటు పెద్ద సంఖ్యలో మీడియా కెమెరామెన్‌లతో ఆయన వచ్చారని దీక్షలో పాల్గొన్న ఒక ఎంపీ పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో రూల్ బుక్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై విసిరి, బల్లలపైకి ఎక్కి నినాదాలతో నిరసన తెలిపిన విపక్ష సభ్యుల్లో టీఎంసీ, కాంగ్రెస్, ఆప్, సీపీఎంలకు చెందిన 8 మందిని సోమవారం సస్పెండ్ చేయడం తెల్సిందే. తమకు సంఘీభావంగా విపక్ష పార్టీలు సభా కార్యాక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించడంతో నిరసనను విరమిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ చెప్పారు.
విపక్షం వాకౌట్
సస్పెన్షన్‌ను వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, మంగళవారం రాజ్యసభ నుంచి కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, డీఎంకే పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు, సస్పెన్షన్‌ను వెనక్కు తీసుకునేవరకు విపక్షాలన్నీ రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ వెల్లడించారు.
క్షమాపణ చెప్తే ఓకే: మరోవైపు, సభలో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులు క్షమాపణ చెప్తే, వారిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసే విషయాన్ని ఆలోచిస్తామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సభా కార్యక్రమాలను బహిష్కరించాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని విపక్ష పార్టీలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో డెప్యూటీ చైర్మన్ హరివంశ్ నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని, పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు.
హరివంశ్ నిరసన
రాజ్యసభలో ఆదివారం విపక్ష సభ్యులు తనకు చేసిన అవమానంపై ఆవేదనతో ఒక రోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో అయినా విపక్ష సభ్యుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నానన్నారు. సభలో తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు హరివంశ్ లేఖ రాశారు. రాష్ట్రపతికి హరివంశ్ రాసిన లేఖను ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఆ లేఖ నేను చదివాను. అది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రతీ ఒక్కరు చదవాల్సిన లేఖ అది’ అని ఆ లేఖను ట్యాగ్ చేస్తూ, మోదీ ట్వీట్ చేశారు.
సమావేశాలు నేటితో ఆఖరు!
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచ్చిం ది. పార్లమెంట్ సభ్యుల్లోనూ కొందరు కరోనా బారిన పడడంతో షెడ్యూల్ కంటే 8 రోజులు ముందుగానే సమావేశాలు ముగి యనున్నాయి. బుధవారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బుధ వారం రాజ్యసభలో ఐదు బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. అలాగే లోక్‌సభలో జీరో అవర్ అనంతరం సభ వాయిదా పడనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెం బర్ 14న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
చాయ్‌పే చర్చ!
దీక్షలో ఉన్న సభ్యులకు మంగళవారం ఉదయం అనుకోని అతిథి దర్శనమిచ్చారు. ఎవరి కారణంగా వారు దీక్షకు దిగాల్సి వచ్చిందో, ఆ వ్యక్తి.. రాజ్యసభ డిప్యూటి చైర్మన్ హరివంశ్ ఉదయమే వారి ముందుకు వచ్చారు. వారికి టీ, స్నాక్స్ తీసుకుని వచ్చి ఆశ్చర్యపరిచారు. ఆయన తెచ్చిన టీ, స్నాక్స్‌ను తాము స్వీకరించలేదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. కాగా, హరివంశ్ పెద్దమనసును ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘తనపై దాడి చేసి అవమాన పరిచిన వారికి స్వయంగా టీ తీసుకురావడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ప్రతీ ప్రజాస్వామ్యవాది గర్వపడేలా హరివంశ్ ప్రవర్తించారు’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment