మే 2 తర్వాత మమత ఆట ముగిసిపోతుంది: మోదీ | PM Narendra Modi said the TMC party days are numbered | Sakshi
Sakshi News home page

మే 2 తర్వాత మమత ఆట ముగిసిపోతుంది: మోదీ

Published Fri, Mar 19 2021 1:16 AM | Last Updated on Fri, Mar 19 2021 12:08 PM

PM Narendra Modi said the TMC party days are numbered - Sakshi

పురూలియా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ఓ మహిళకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ

పురూలియా: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆట ముగిసిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. దీదీ సర్కార్‌కి రోజులు దగ్గర పడ్డాయని, అసలు సిసలు పరివర్తన ఇక మొదలు కానుందని అన్నారు. ‘‘దీదీ మీరు పదేళ్లు మీ ఆట ఆడారు. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే దీదీ ఖేలా శేష్‌ హోబె, వికాస్‌ ఆరంభ్‌ హోబె (ఆమె ఆట ముగిసిపోతుంది, మా అభివృద్ధి ప్రారంభమవుతుంది)’’అని ప్రధాని అన్నారు.

ఈ నెల 27 నుంచి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలు కానున్న నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతమైన జంగల్‌మహల్‌ ప్రాంతంలోని పురూలియాలో గురువారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖేలా హోబె (ఆట మొదలైంది) నినాదాన్ని ప్రస్తావిస్తూ మాటల తూటాలు విసిరారు. ‘మమత ఎన్నికల ర్యాలీలో తరచూ ఆట మొదలైంది అని అంటూ ఉంటారని ఆమెకు ఆట మొదలైందేమో కానీ బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, విద్య, మహిళా సాధికారత, ఉద్యోగాలు, పక్కా ఇళ్లు, సురక్షిత నీరు, ఇంటింటికీ కుళాయిలు అన్నీ మొదలవుతాయని ప్రధాని గట్టిగా చెప్పారు.  

కట్‌ మనీ ప్రభుత్వం  
మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతి బురదలో కూరుకుపోయిందని ప్రధాని ఆరోపించారు. కమీషన్లు లేనిదే ప్రభుత్వం పని చేయడం లేదని, అధికార పార్టీ చేస్తున్న ఈ దోపిడీ వల్ల దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన వర్గాలు అధికంగా నష్టపోతున్నారని అన్నారు. భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని మధ్య మధ్యలో బెంగాలీలో కొన్ని వాక్యాలు మాట్లాడుతూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘‘మీరు చాలా కాలంగా ప్రజల్ని అణచివేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో మిమ్మల్ని ఓడిస్తాం’’అని సభికుల హర్షధ్వానాల మధ్య బెంగాలీలో చెప్పారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పదానికి ప్రధాని కొత్త అర్థాన్ని ఇచ్చారు. టీఎంసీ అంటే ట్రాన్స్‌ఫర్‌ మై కమిషన్‌ అని అభివర్ణించారు. కేంద్రం డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానాన్ని అనుసరిస్తూ ఉంటే, తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్రాన్స్‌ఫర్‌ మై కమిషన్‌ అంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని లూటీ చేసే మావోయిస్టులను మమత సర్కార్‌ పెంచి పోషిస్తోందని మోదీ ఆరోపించారు.

కేంద్ర నిధులన్నీ స్వాహా  
వెనుకబడిన ప్రాంతాలకి, వర్గాలకి కేంద్రం అందించే నిధులేవీ మమత ప్రజలకు ఇవ్వడం లేదని ప్రధాని ఆరోపించారు. ‘కేంద్రం పక్కా గృహాల కోసం నిధులు ఇచ్చింది. టీఎంసీ సర్కార్‌ దానిని స్వాహా చేసింది. నిరుపేదలకు తక్కువ ధరకే బియ్యం పంపాం. టీఎంసీ దోపిడీదారులు దానిని మింగేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉచిత బియ్యం ఇచ్చాం. దీదీ సర్కార్‌ వాటిని బొక్కేసింది. అంఫాన్‌ తుపాను సమయంలోనూ అదే తీరు. రైతన్నలు, సాంతాల్‌ గిరిజనులు సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. వారిపై మమత కురిపించలేదు’’అనివిమర్శించారు. మమత తన ఆటలో తాను మునిగితేలిపోతున్నారని, దీంతో ఈ గిరిజన ప్రాంతానికి పరిశ్రమలు రావడం లేదని, నీళ్లు లేక వ్యవసాయం సంక్లిష్టంగా మారి ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ జనం వలస బాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వలసల్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement