వారసత్వ రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికే ముప్పు | PM Narendra Modi talks on Legacy Politics | Sakshi
Sakshi News home page

వారసత్వ రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికే ముప్పు

Published Thu, Feb 10 2022 3:51 AM | Last Updated on Thu, Feb 10 2022 8:36 AM

PM Narendra Modi talks on Legacy Politics - Sakshi

న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలను ప్రజాస్వామ్యానికి ముప్పుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు బీజేపీదేనని ధీమా వెలిబుచ్చారు. యూపీలోని 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం తొలి దశ పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీని గెలిపించే ధోరణికి యూపీ ప్రజలు స్వస్తి చెప్పారు. వారు 2014 (లోక్‌సభ) ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించారు. మా పనితీరు నచ్చి 2017 (అసెంబ్లీ) ఎన్నికల్లో మళ్లీ అవకాశమిచ్చారు. తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా మేం చేసిన అభివృద్ధిని మెచ్చి 2019 (లోక్‌సభ) ఎన్నికల్లోనూ మాకే ఓటేశారు. ఇప్పుడూ బీజేపీకే అవకాశమిస్తారు’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. పలు అంశాలపై మోదీ ఏమన్నారంటే...

యూపీ మహిళలు రాత్రి పూట తిరగొచ్చు...
గతంలో యూపీ అంటే మాఫియారాజ్, గూండారాజ్‌ మాత్రమే గుర్తొచ్చేవి. వాటిని ప్రభుత్వాలే ప్రోత్సహించేవి. ఇప్పుడక్కడ శాంతిభద్రతలను యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అద్భుతంగా చక్కదిద్దింది. ఇప్పుడు యూపీ మహిళలు రాత్రుళ్లు కూడా నిర్భయంగా ఒంటరిగా బయటికి వెళ్లవచ్చు. ఎస్పీ, బీఎస్పీ కల్లబొల్లి మాటలను ఓటర్లు వినే పరిస్థితి లేదు.

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పు...
వారసత్వ రాజకీయాలు నా దృష్టిలో కుహనా సామ్యవాదం. రాం మనోహర్‌ లోహియా, జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌కుమార్‌ కుటుంబాలు మీకెక్కడైనా కన్పిస్తాయా? సోషలిస్టులంటే వాళ్లు. సమాజ్‌వాదీ పార్టీలో కనీసం 45 పదవుల్లో అగ్ర నేతల కుటుంబీకులేనట! కశ్మీర్, హరియాణా మొదలుకుని యూపీ, జార్ఖండ్, తమిళనాడు దాకా చాలా రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలున్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువు. డైనాస్టీ (వారసత్వం) ఉన్న చోట డైనమిజం ఉండదు. కుల రాజకీయాలు కూడా శాశ్వతంగా పోవాలి. ఎన్నికల్లో లబ్ధి కోసం కుల జపం చేయడం సరికాదు.

హెడ్‌లైన్ల కోసం పాకులాడట్లేదు...
నిత్యం పతాక శీర్షికల్లో నిలవాలని నేనెన్నడూ పాకులాడలేదు. అంతర్జాతీయంగా దేశ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలన్నదే నా తపన. కానీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే మీడియా సంస్థలు మన దేశంలో తప్ప బహుశా ప్రపంచంలో మరెక్కడా ఉండవేమో!

దర్యాప్తు సంస్థల దురుపయోగం అబద్ధం...
దర్యాప్తు సంస్థలను మేం దురుపయోగం చేస్తున్నామన్నది అబద్ధం. దేశవ్యాప్తంగా అవినీతి భరతం పడుతూ వందలాది, వేలాది కోట్ల జాతి సంపద ఖజానాకు జమ చేస్తున్నందుకు నిజానికి నన్ను మెచ్చుకోవాలి. అవినీతి దేశానికి పట్టిన చీడ. దీనిపై నేనేమీ చేయకపోతే ప్రజలు నన్ను క్షమిస్తారా? ఎన్నికలప్పుడు ప్రత్యర్థులను వేధించేందుకు వీటిని వా డుకుంటున్నామంటున్న పార్టీలకు దమ్ముంటే దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలకు అంగీకరించాలి.

నెహ్రూపై విమర్శలు సబబే...
నేను ఎవరి తండ్రి గురించో, తాత గురించో పనిగట్టుకుని మాట్లాడలేదు (రాహుల్‌నుద్దేశించి). కేవలం ఒక మాజీ ప్రధాని ఏం చెప్పారో గుర్తు చేశా. అది తెలుసుకోవడం దేశం హక్కు. మేం నెహ్రూ పేరే ఎత్తొద్దన్నది వారి వాదన. వాళ్లకు అంత భయమెందుకో!

దేశం కోసమే సాగు చట్టాలు వెనక్కు..
నేను రైతుల మనసు గెలుచుకునేందుకే వచ్చాను. గెలిచాను కూడా. చిన్న రైతుల సమస్యలు నాకు తెలుసు. సాగు చట్టాలను రైతుల ప్రయోజనం కోసమే తెచ్చాం. కానీ అంతిమంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని వెనక్కు తీసుకున్నాం.

ఎన్నికలు మాకు నిత్య పాఠాలు..
ఎన్నికలను మేం కేవలం రాజకీయ దృష్టితో మాత్రమే చూడం. అవి మాకు ఓపెన్‌ యూనివర్సిటీల వంటివి. మమ్మల్ని మేం మెరుగుపరుచుకునేందుకు గొప్ప అవకాశాలుగా వాటిని చూస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement