సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన ఓటమితో కుదేలైన తెలుగుదేశం పార్టీకి 2021 పరాభవ నామ సంవత్సరంగా మిగిలింది. సాధారణ ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన ఓటమితో కుదేలైన ఆ పార్టీ ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలతో పాతాళంలో కూరుకుపోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది ఘోరమైన ఛీత్కారాలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష పాత్ర పోషించలేని స్థితిలో ఎన్నికల్ని బహిష్కరించడం దగ్గర నుంచి తమకు ఓటు వేయలేదనే అక్కసుతో ప్రజలనే నిందించడం, శాపనార్థాలు పెట్టడం ఈ ఏడాది ఆ పార్టీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఏ దశలోను పోటీపడలేక బురద జల్లడమే పనిగా పెట్టుకున్నా ప్రజల నుంచి ఎటువంటి సానుకూలత టీడీపీకి రాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చదవండి: వంగవీటి రాధాకు ప్రభుత్వ భద్రత
స్థానిక ఎన్నికల ఫలితాలతో కుంగుబాటు
ఈ ఏడాది స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడాన్ని బట్టి ప్రజల్లో ఆ పార్టీకి ఉన్న స్థానం ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా టీడీపీ చతికిలపడడం చూసి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. జనవరిలో పార్టీ గుర్తులేకుండా జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో తమకు 35 శాతానికి పైగా పంచాయతీలు వచ్చినట్లు చంద్రబాబు అదేపనిగా బుకాయించి ప్రజల తీర్పును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.
వాస్తవంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం పంచాయతీలు కూడా దక్కలేదు. కానీ, పార్టీ గుర్తుల్లేకుండా జరిగిన ఎన్నికలు కావడంతో ఆ ఎన్నికల్ని వివాదం చేసి తమ ఓటమిని కప్పిపుచ్చుకోవాలని చూశారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీల్లో టీడీపీ 14 మాత్రమే గెలవడంతో చంద్రబాబు బుకాయింపు గాలి బుడగలా పేలిపోయింది. 30 ఏళ్లు చంద్రబాబుకు అండగా నిలిచిన కుప్పం ప్రజలు తొలిసారి ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో టీడీపీకి శరాఘాతంగా మారింది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పాతాళానికి..
మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే ఒకే ఒక మున్సిపాల్టీని ఆ పార్టీ గెలుచుకోగలిగింది. 11 మున్సిపాల్టీల్లో అసలు టీడీపీ అడుగే పెట్టలేకపోయింది. ప్రజల్లో టీడీపీకి ఉన్న ఆదరణను మున్సిపల్ ఎన్నికల ఓటమి స్పష్టంచేసింది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలోను చిత్తుగా ఓడిపోయింది. ఇక పోటీ ఇవ్వలేక పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. ఆ తర్వాత బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలోను అభ్యర్థిని ప్రకటించి తర్వాత తప్పుకున్నారు. మలి విడత జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీచేసినా ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇందులో ఏకంగా కుప్పం మున్సిపాల్టీనే చంద్రబాబు చేజార్చుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీ ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలుచుకోలేకపోయింది. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు సాధారణ ఎన్నికల కంటే ఇంకా దిగజారినట్లు ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైంది.
ఓటములతో నేతల అసహన పర్వం
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ప్రజలపైనే విరుచుకుపడుతూ తమ అసహనాన్ని పదేపదే బహిర్గతం చేసుకున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు సిగ్గులేదని, ఎవరికి ఓటేయాలో కూడా తెలీదంటూ చంద్రబాబు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. రాజకీయంగా కునారిల్లిన దశలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పట్టాభిరామ్ తదితర నేతలు సీఎం వైఎస్ జగన్, మంత్రులను పరుష పదజాలంతో రాయలేని భాషలో దూషించి ప్రజల దృష్టిలో ఇంకా చులకనయ్యారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.
సీఎంను బోషడీకే అంటూ టీడీపీ నాయకుడు పట్టాభి దూషించడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించగా.. తదనంతరం ప్రజల్లో టీడీపీపై ఆగ్రహం పెల్లుబికింది. పూర్తిగా ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై బురద జల్లడమే పనిగా ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా అభూత కల్పనలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకున్నారనే అభిప్రాయం నెలకొంది. అన్ని రకాలుగా కుంగిపోయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పరిమితమయ్యారు. చంద్రబాబు పిలుపు ఇచ్చినా ఆందోళనలు, నిరసనల్లో ఆ పార్టీ కేడర్ పాల్గొనే పరిస్థితి లేకుండాపోయింది. రాజకీయ పతనంలో 2021 సంవత్సరం టీడీపీకి కొత్త కోణాన్ని పరిచయం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment