సాక్షి, నంద్యాల: నంద్యాలలో రోడ్డున పడ్డ తెలుగుదేశం పరువును అర్జంటుగా కాపాడేందుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు రంగంలోకి దిగారు. లోకేష్ యువగళం పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలుగవద్దని, పార్టీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతినొద్దంటూ కింది క్యాడర్ కు సందేశమిచ్చారు చంద్రబాబు. కొట్టుకున్నది చాలు, కేసులు వద్దు అంటూ రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఓ వైపు ఇదే జిల్లాలో పాదయాత్ర, మరో వైపు సొంత పార్టీలోనే కుమ్ములాటలు బాబుకు ఇరకాటంగా మారాయి.
నిన్న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దాడులకు దిగిన భూమా అఖిలప్రియను, దెబ్బలు తిన్న ఏవీ సుబ్బారెడ్డిని రాజీపరిచేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అఖిలప్రియపై పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డిపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నట్టు టీడీపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. కానీ, చంద్రబాబు ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ కేసు విషయంలో రాజీపడే ప్రస్తకే లేదని ఏవీ సుబ్బారెడ్డి ఫిక్స్ అయినట్టు ఆయన వర్గం చెబుతోంది.
ఇదిలా ఉండగా.. తనపై దాడికి పాల్పడినట్టు ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందుగా ఏవి సుబ్బారెడ్డినే తనపై దుర్భాష లాడి దాడికి యత్నించారని అఖిలప్రియ నేరుగా డిజిపి కి ఫిర్యాదు చేసింది. దాంతో పాటు ఏవి సుబ్బారెడ్డిపై నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది భూమా అఖిల ప్రియ. నిన్న జరిగిన ఘటనలో తమపై ముందుగా ఏవి సుబ్బారెడ్డి దాడి చేశారని, తమను తాము రక్షించుకునే క్రమంలో ఎదురుదాడి జరిగిందని తెలిపింది.
మరోవైపు.. వీరిద్దరిని రాజీకి ఒప్పించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్సీ ఫరూఖ్ ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే అరెస్టయిన భూమా అఖిలప్రియను పాణ్యం నుంచి నంద్యాల తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నంద్యాల కోర్టులో జడ్జి ముందు అఖిలప్రియను హాజరు పరిచారు పోలీసులు.
ఇది కూడా చదవండి: కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment