సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ఆంధ్రులు క్షేమంగా ఉన్నారని అన్నారు. ఆంధ్రా ప్రజలపై కేసీఆర్‌కు ఏమాత్రం కోపం లేదని, కేవలం దోచుకున్న వారిపైనే కోపంతో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తమేనని వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని, కేసీఆర్ లాంటి పట్టుదల ఉన్న సీఎంను చూడలేదని సోనాని అభిప్రాయపడ్డారు. జీజీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో దర్శకుడు శంకర్‌తో కలిసి పోసాని శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. (బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్, సర్వే సత్యనారాయణ!)
‘ప్రస్తుతం దేశంలో ఉన్నవాళ్ళలో కేసీఆర్ మంచి ముఖ్యమంత్రి. గతంలో హైదరాబాద్ లో మత కలహాలు యథేచ్ఛగా ఉండేవి.ఎన్టీఆర్ హయాంలో మత కలహాలు తగ్గాయి. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో హిందూ, ముస్లింలు మత సామరస్యంతో ఉంటున్నారు. ఏపీ ప్రజలను కేసీఆర్ హైదరాబాద్ నుండి తరిమి కొడతారంటూ దుష్ప్రచారం చేశారు. కేసీఆర్‌కు ఏపీ ప్రజలపై కోపం లేదు.. ఏపీ నుండి వచ్చి తెలంగాణను దోచుకున్న నాయకులపైనే కోపం ఉంది. తెలంగాణ వచ్చాక ఏపీ ప్రజలపై ఎలాంటి దాడులు జరగలేదు. తెలంగాణ బిడ్డల మాదిరిగానే ఏపీ వారిని కేసీఆర్ క్షేమంగా చూస్తున్నారు.
నాయకుడు నీతి మంతుడు అయితే ప్రజలకు అవే అలవాటు అవుతాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్ కొన్ని ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసారు..అవన్నీ ఆవేశంలో అన్న మాటలే. తెలంగాణలో గతంలో నీరు ఉండేది కాదు.. రైతులకు అనేక ఇబ్బందులు ఉండేవికేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో పవర్ కట్ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ప్రాంతాలు పచ్చదనంతో ఉన్నాయి. గ్రామాలు అభివృద్ధి చెందాయి’ అని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. ‘ఒక విజన్‌తో కేటీఆర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్వేగానికి లోనయ్యారే తప్ప విద్వేషాలను రెచ్చగొట్టలేదు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ప్రజలు భయపడేవారు. ఇప్పుడు ఎంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. గూగుల్, అమెజాన్, ఆపిల్ వంటి సంస్థలు హైదరాబాద్ కు వస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి, లింకు రోడ్లు, ఫ్లయ్ ఓవర్లు నిర్మించారు. హైదరాబాద్ వరదలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. రాజకీయాల కోసం హైదరాబాద్ ప్రజల్లో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment