1950ల నుంచి కాంగ్రెస్ కంచుకోట ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం. అయితే అదే స్థానం నుంచి వరుసగా 5 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన సోనియా గాంధీ అనారోగ్య కారణంగా పోటీ నుంచి తప్పుకుంటుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇంతకీ రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని బరిలోకి దింపాలని భావిస్తోంది? లేదంటే సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ప్రియాంక గాంధీ వాద్రా మద్దతుదారులు రాయ్‌బరేలీలో పోస్టర్లు వేసి, పార్టీ నాయకత్వం ఆమెను లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా మద్దతుదారులు నియోజకవర్గంలో పోస్టర్లను విడుదల చేశారు.
‘ప్రియాంక గాంధీ జీ రాయ్‌బరేలీ పిలుస్తోంది. దయచేసి రండి కాంగ్రెస్‌ను ముందుకు నడిపించండి’ అంటూ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్‌ల ఫోటోలతో ఉన్న పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.
కాంగ్రెస్‌కు కంచుకోట
ఇక కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీకి గతంలో మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన స్థానంలో రెండు దశబద్ధాలుగా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలిగా వెళ్లనున్నారు. ఆమె స్థానంలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు.
దేశం మొత్తం రాయ్ బరేలీ వైపే చూపు
2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనంతో అమేథీలో రాహుల్ ఓటమి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూలతలు ఎదురైనా రాయ్‌బరేలీలో మాత్రం కాంగ్రెస్ తట్టుకొని నిలబడింది. అందువల్ల, ఈ సీటుకు బీజేపీ అభ్యర్ధి ఎంపిక, సోనియా గాంధీ ఆ స్థానాన్ని ఖాళీ చేస్తే కాంగ్రెస్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందా అనే అంశంపై దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
కమలం వికససించాలని
2019 ఎన్నికల్లో సోనియా గాంధీపై బీజేపీ అభ్యర్ధి దినేష్ ప్రతాప్ సింగ్‌ను బరిలోకి దింపింది. సోనియా గాంధీ చేతిలో 1.60 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన సింగ్, ఈసారి ఎవరిని ఎంచుకుంటే వారికే తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. రాయబరేలీలో అధిష్టానం ఎవరిని ఎన్నుకుంటే వారి గెలుపుకోసం శ్రమిస్తాం. కమలం వికసించాలనేది నా సంకల్పం’ అని దినేష్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమోథీ బరిలో రాహుల్
ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకమైన అమేథీలో బీజేపీ తన అభ్యర్థిగా కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని నిలబెట్టుకుంది. ఇరానీ అమేథీ నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన ఆమె 2019లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఓడించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథిలో ఓటమి పాలైనా.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయి ఆధిక్యంతో గెలుపొందారు. అమేథీకి గతంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. వచ్చే ఎన్నికల్లో అమేథీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment