
సాక్షి, హైదరాబాద్/ చేవెళ్ల: రాష్ట్రంలోని దళిత, గిరిజన ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈసారి తమకు అధికారమిస్తే.. గతంలో వారికి అసైన్ చేసిన భూములపై సర్వహక్కులు కల్పిస్తామని, ఆ భూములను అమ్ముకోవడం సహా అన్నిరకాల యాజమాన్య హక్కులను అనుభవించవచ్చని హామీ ఇవ్వనుంది. ఈ మేరకు శనివారం చేవెళ్ల వేదికగా జరగనున్న ‘ప్రజాగర్జన’సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.
భూముల అంశమే ప్రధానంగా..
కాంగ్రెస్ తమ డిక్లరేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వివిధ రూపాల్లో పేదలకు అసైన్ చేసిన భూముల్లో.. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 24 లక్షల ఎకరాలపై వారికి పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించనున్నట్టు వివరిస్తున్నా యి.
అదే విధంగా రాష్ట్రంలోని గిరిజన, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న 12 లక్షల ఎకరాల భూములకు అటవీ హక్కుల చట్టం అ మలు ద్వారా పట్టాలు అందజేస్తామని.. వాటిపై కూడా గిరిజనులకు సర్వహక్కులు కల్పిస్తామని హామీ ఇవ్వనున్నట్టు వెల్లడిస్తున్నాయి.
అదనపు ఆర్థిక సాయంతో..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచి్చన దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలు ఇస్తుండగా.. తాము రూ.12 లక్షలు ఇస్తామని, గిరిజనబంధు కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించనున్నట్టు తెలిసింది. దళితులు, గిరిజనులకు ఇళ్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తా మని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం.
ఇప్పటికే రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్.. ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనంగా ఇవ్వనుంది. ఇక ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని.. విద్య, వైద్య రంగాల్లో దళిత, గిరిజనులకు ప్రాధాన్యత కల్పించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామనే హామీలు కూడా ప్రకటించనున్నట్టు సమాచారం.
నేడు 4 గంటలకు‘ప్రజాగర్జన’ సభ
చేవెళ్లలో ప్రజాగర్జన సభ శనివా రం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. మల్లికార్జున ఖర్గే ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ ఆహా్వనితుడు దామోదర రాజనర్సింహ తదితరులు హాజరుకానున్నారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ఖర్గే ప్రకటిస్తారని గాందీభవన్ వర్గాలు చెప్పాయి. బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న ఖర్గే.. అక్కడి నుంచి నేరుగా చేవెళ్ల వెళ్లి సభలో పాల్గొంటారని, రాత్రికి హైదరాబాద్ చేరుకుని బస చేస్తారని తెలిపాయి.
బీఆర్‌ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం
ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల జీవన స్థితిగతులు బాగుపడతాయని భావించామని.. కానీ బీఆర్‌ఎస్ సర్కారు పాలనలో ప్రజలు ఆత్మగౌరవం కోల్పోయి బతుకుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం రాత్రి ఆయన చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ ‘ప్రజాగర్జన సభ’ఏర్పాట్లను పార్టీ నేతలు శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌యాదవ్, ప్రీతమ్, వేం నరేందర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, బలరాంనాయక్, కేఎల్‌ఆర్, చల్లా నర్సింహారెడ్డి, తదితరులతో కలసి పరిశీలించారు.
తర్వాత మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ను నమ్మి పదేళ్లుగా మోసపోతున్న ప్రజలకు కాంగ్రెస్ రూపంలో విముక్తి లభించనుందన్నారు. దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఏం చేయబోతోందో చెప్పేందుకు సభ ఏర్పాటు చేశామన్నారు. చేవెళ్ల ప్రాంతానికి కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని, వైఎస్ హయాంలోనే ఇది నిరూపితమైందని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో దళితులకు ఇచ్చిన భూములను బీఆర్‌ఎస్ సర్కార్ లాక్కుంటోందని ఆరోపించారు. శనివారం సాయంత్రం జరగనున్న ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు భరోసా అని శ్రీధర్‌బాబు, బలరాంనాయక్ పేర్కొన్నారు.