ప్రతి ఎన్నికల్లోనూ మార్పును ఆహ్వానిస్తున్న మల్కాజిగిరి ఓటర్లు
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన గెలుపు
సిట్టింట్ స్థానం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ యత్నాలు
ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
సుదీర్ఘ రాజకీయం అనుభవం, మోదీ చరిష్మాతో ఈటల పావులు
మరింత పట్టు బిగిస్తున్న గులాబీ దళం
అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 నియోజకవర్గాల్లో గెలిచిన బీఆర్‌ఎస్
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంతో పాటు మినీ భారత్‌గా పేరొందిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మధ్యనే పోటీ కొనసాగుతోంది.
సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పట్నం సునీత జెడ్పీ చైర్‌పర్సన్‌గా మూడు పర్యాయాలు పనిచేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన రాగిడి ఈసారి ఆ పార్టీ అభ్యగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ముగ్గురు నేతలు కింది స్థాయి కార్యకర్తల పనితీరును సమన్వయం చేసుకుంటూ విజయమే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ మార్పును ఆహా్వనించే మల్కాజిగిరి
ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది.
రేవంత్‌కు ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ గెలుపు
మల్కాజిగిరి సిట్టింగ్ స్థానం కావటంతో పాటు ఇక్కడ ఎంపీగా పని చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. వాస్తవానికి చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన సునీతా మహేందర్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మల్కాజిగిరి టికెట్ కట్టబెట్టింది. మహిళ కావటం, పార్టీ అధికారంలో ఉండటం, ఇటీవల బీఆర్‌ఎస్ సహా ఇతర పా ర్టీ లకు చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరటం ఆమెకు కలిసొచ్చే అంశాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పైగా నియోజకవర్గంలోని నేతలందర్నీ సమన్వయం చేసే బాధ్యతను స్వయంగా రేవంత్‌రెడ్డి తీసుకోవటంతో సునీత విజయావకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయగా నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు కనుసన్నల్లో ఎన్నికల ప్రచారం సాగుతోంది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై గెలుపు భారం
అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధి లో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థు లు గెలుపొందారు. కంట్మోనెంట్ ఎమ్మెల్యే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. దీంతో ఇక్కడ గెలుపు బీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. పా ర్టీ కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాగిడి గెలుపు కోసం అంత చురుగ్గా వ్యవహరించటం లేదని పార్టీ వర్గాల్లోనే విమర్శలు విన్పిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ టికెట్ దక్కించుకోవటంలో విజయం సాధించిన రాగిడి లక్ష్మారెడ్డి పా ర్టీ లో నెలకొన్న అనిశ్చితిని తొలగిస్తేనే విజయం సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 7 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో పార్టీ బలంగా ఉండటంతో బీఆర్‌ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం పరిధిలో పలు సమావేశాలకు హాజరవుతూ కేడర్ ప్రచారంలో పాల్గొనేలా ఉత్సాహపరుస్తున్నారు. రాగిడి కూడా భారీ ర్యాలీలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.
విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం
బీజేపీ టికెట్ ఈటలను వరించటం ఓ అనూహ్య పరిణామమని చెప్పవచ్చు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరున్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఈటల ఓటమి పాలయ్యారు. అయితే పార్లమెంటు ఎన్నికలనేవి అనేక అంశాలపై ఆధారపడి జరిగేవి కావడం, ప్రధాని మోదీ చరిష్మా, హిందూత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అండదండలు కలిసివచ్చే అంశాలుగా భావించవచ్చు.
పా ర్టీ లోని క్రియాశీలకమైన నాయకుల తోడ్పాటు సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాని మోదీ ఇక్కడ రోడ్ షో నిర్వహించటం, పలువురు కేంద్ర మంత్రులు కూడా స్థానికంగా ఎన్నికల సభల్లో పాల్గొని కేడర్‌ను ఉత్తేజితులను చేయటం గెలుపునకు అనుకూలతగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈటల కూడా సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల్లో విస్తృతంగా పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని వేడేక్కిస్తున్నారు.
కార్మికుల ఓట్లూ కీలకం!
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కంట్మోనెంట్ మినహాయించి ఉప్పల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఎల్బీనగర్ పరిధిలోని జీడిమెట్ల, బాలానగర్, శామీర్‌పేట్, మేడ్చల్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, నాచారం, మల్లాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో పారిశ్రామికవాడలున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ప్రైవేటులో ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలు ఉన్నాయి.
మౌలాలి ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్ ఫరి్నచర్, కెమికల్, ఎల్రక్టానిక్స్ తరహా పరిశ్రమలు ఉన్నాయి. కోకాకోలా కంపెనీల్లో కూడా కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. బాలానగర్ పారిశ్రామికవాడ పరిధిలో ఫ్యాన్లు తయారు చేసే కంపెనీలు, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, బీర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, ఫాబ్రికేషన్, వైర్ మెష్ యూనిట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా యూనిట్లు తదితర కంపెనీలు ఉన్నాయి.
ఐడీఏ బాలానగర్, ఐడీఏ కూకట్‌పల్లి, సీఐఈ గాంధీనగర్ ఒకే చోట ఉన్నాయి. శామీర్‌పేట్, మేడ్చల్ మండలాల్లో బయెటెక్, కెమికల్, ఇతర చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. గుండ్లపోచంపల్లిలో అపరెల్ టెక్స్‌టైల్ పార్కు ఉంది. తుర్కపల్లిలో ఐసీఐసీఐ నాలెడ్జి కంపెనీ పేరుతో పరిశ్రమల హబ్ ఏర్పడ్డాయి.
ఘట్‌కేసర్, కీసరలలో కూడా చిన్న కంపెనీలు, వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో ఈ పరిశ్రమల్లో పని చేసే కార్మికుల ఓట్లపై కూడా ప్రధాన పా ర్టీ ల అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయనే చర్చ సాగుతోంది.
ఇక్కడ గెలిస్తే మంచి భవిష్యత్తు!
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పలువురు రాజకీయ నాయకులకు పునర్జన్మనిచ్చిందనటంలో అతియోశక్తి లేదు. ఇక్కడ ఎంపీగా గెలుపొందిన నేతలకు తమ పార్టీలో అత్యున్నత పదవులు దక్కడమే కాకుండా పాలనా పరంగా ముఖ్యమంత్రిగా, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పని చేసే అవకాశం లభించింది. అదే సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు కూడా రాజకీయ రంగంలో మేలు జరిగిందనే అభిప్రాం కూడా ఉండటం గమనార్హం.
2009లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన సర్వే సత్యనారాయణకు కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కింది. 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన చామకూర మల్లారెడ్డి తన పదవీ కాలం పూర్తి చేసుకోక ముందే మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్‌రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తదనంతరం టీపీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు.
అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారి కూడా మంత్రిగా పని చేయని రేవంత్‌రెడ్డి ఏకంగా సీఎం కావటానికి మల్కాజిగిరి నియోజకవర్గ సెంటిమెంటే కారణమని స్థానికులు చర్చించుకుంటూ ఉంటారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందడాన్ని కూడా స్థానికులు ప్రస్తావిస్తూ ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment