జైపూర్/గ్వాలియర్: దేశ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలకు ఒక విజన్ లేదని, రోడ్‌మ్యాప్ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. రాజస్తాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం ఖాయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఓటమిని ముందే అంగీకరించారని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను బీజేపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేయొద్దని, ఎప్పటిలాగే కొనసాగించాలని, ఆ మేరకు గ్యారంటీ ఇవ్వాలని గహ్లోత్ ఇటీవల కోరారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్న సంగతి గహ్లోత్‌కు తెలిసిపోయిందని అన్నారు. మోదీ రాజస్తాన్‌లో రూ.7,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శాన్‌వాలియా శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిత్తోర్‌గఢ్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలకు మేలు చేకూర్చే ఏ పథకాన్నీ తాము రద్దు చేయబోమని, పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని తేలి్చచెప్పారు.
భారత్ విజయాలను విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి
ప్రతిపక్షాలు అభివృద్ధి వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దేశ అభివృద్ధిపై ప్రతిపక్షాలకు ఒక విజన్ గానీ, రోడ్‌మ్యాప్ గానీ లేదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. మోదీ మధ్యప్రదేశ్‌లో రూ.19,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. కొన్ని ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. గ్వాలియర్‌లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ప్రశంసలు దక్కుతున్నాయని, ఈ నిజాన్ని ప్రతిపక్షాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలకు కేవలం అధికారం తప్ప ఇంకేమీ కనిపించడం లేదని ప్రధానమంత్రి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment