
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారనే ఊహాగానాల మధ్య లాక్‌డౌన్ అంచనాలకు ప్రధాని తెరదించారు. మహమ్మారిపై మరోసారి భీకర యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా యుద్ధంపై గెలవాలని మోదీ దేశ వాసులకు పిలుపునిచ్చారు.
మోదీ ప్రసంగంలోని కొన్ని ముఖ్య విషయాలు
కరోనా సెకండ్ వేవ్ తుపానులా విస్తరిస్తోంది. కరోనాపై దేశం అతిపెద్ద యుద్దం చేస్తోంది.ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశ ప్రజలు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు చాలా బాధ కలిగిస్తున్నాయి.అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దేశంలో ఆక్సిజన్ డిమాండ్ భారీగా పెరిగింది. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తికి, కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి కృషి చేస్తున్నాం. ఈ మేరకు పలు ఫార్మా కంపెనీలను సంప్రదించాం. భారీగా కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.దేశంలో తయారైన రెండు టీకాల ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాం. ఇప్పటికే 12 కోట్లమందికి పైగా వ్యాక్సిన్లు అందించాం. మే ఒకటవ తేదీనుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం. కొత్త వ్యాక్సిన్ కోసం ఫ్రాస్ట్ ట్రాక్ పద్ధతిని అవలంభించనున్నాం. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీమీ ప్రాంతాల్లో, అపార్ట్‌మెంట్లలో కమిటీలుగా ఏర్పడి జాగ్రత్తలు తీసుకోవాలి. అపుడిక కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు అవసరమే ఉండదు. కరోనా నియంత్రణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే అత్యవసర పరిస్థితి వస్తే బయటికి వెళ్లకుండా ప్రజలు నియంత్రణలో ఉండాలని, లాక్‌డౌన్ వైపు దేశం పయమనించకుండా జాగ్రత్తగా ఉండాలని మోదీ ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment