మేమొస్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌  | Priyanka Gandhi promise at election campaign in Chhattisgarh | Sakshi
Sakshi News home page

మేమొస్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ 

Published Tue, Oct 31 2023 5:18 AM | Last Updated on Tue, Oct 31 2023 5:18 AM

Priyanka Gandhi promise at election campaign in Chhattisgarh - Sakshi

జల్‌బంధా: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కొత్తగా మహతారీ న్యాయ్‌ యోజన పథకం ప్రారంభించి మహిళలకు రూ.500కే వంటగ్యాస్‌ అందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్‌బంధాలో ఆమె ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ‘ మేం మళ్లీ అధికారంలోకి వస్తే దాదాపు 6,000 ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక, ఉన్నత పాఠశాలలను స్వామి ఆత్మానంద్‌ ఇంగ్లిష్, హిందీ మీడియం స్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ అందిస్తాం.

స్వయం సహాయక బృందాలు, సాక్ష్యమ్‌ యోజన కింద రుణాల పొందిన వారి రుణాలను మాఫీ చేస్తాం. కొత్తగా 700 గ్రామీణ పారిశ్రామిక పార్కులను నెలకొల్పుతాం. దీంతో వీటి సంఖ్య ఏకంగా 1,000కి చేరుతుంది. తివారా రకం పప్పు ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుచేయనుంది’ అని ప్రియాంక పలు హామీ ప్రకటించారు.

‘ 2018 ఏడాది వరకు రాష్ట్రంలోని రవాణా రంగంతో సంబంధం ఉన్న 6,600 మందికిపైగా వాహన యజమానుల వాహన పన్నును మాఫీ చేస్తాం’ అని ప్రకటించారు. వంట గ్యాస్‌పై మహిళలకు ఇచ్చే రూ.500 సబ్సిడీని నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలోనే జమచేస్తామని ర్యాలీ తర్వాత ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ పోస్ట్‌చేశారు.  

మహిళలను తెలివితక్కువ వాళ్లుగా లెక్కగట్టారు 
ర్యాలీ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపైనా ప్రియాంక నిప్పులు చెరిగారు. ‘ మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయినా అక్కడ మహిళలకు దక్కిన హక్కులు, రక్షణ శూన్యం. హింస పెరిగింది. ఆ రాష్ట్రంలో రోజూ సగటున 17 అత్యాచారాలు నమోదవడం సిగ్గుచేటు.

ఇన్నాళ్లూ మహిళలను గాలికొదిలేసిన చౌహాన్‌ సర్కార్‌ రెండు నెలల క్రితం లాడ్లీ బెహ్‌నా పథకం మొదలుపెట్టి మహిళల ఖాతాలోకి కొంత మొత్తం జమచేయడం షురూ చేసింది. ప్రభుత్వం అకస్మాత్తుగా మహిళలపై ప్రేమ ఒలకబోస్తోంది. ఎన్నికల వేళ ఆమాత్రం తెలుసుకోలేనంత తెలివితక్కువ వారిగా మహిళలను లెక్కగట్టింది’ అని ప్రియాంక ఆరోపించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement