చంకూర్ సాహిబ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు చంకూర్‌సాహిబ్, బహదూర్ నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సామాన్యుల్లో ఒకరిగా కలిసిపోతూ ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. లూథియానాలో ప్రచారం చేస్తూ ఒక ధాబాలో లారీ డ్రైవర్లతో కలిసి భోజనం చేశారు. మరోసారి ఒక ఎన్నికల సభలో వేదిక మీద నుంచి కిందకి దిగి వచ్చి ప్రజలతో కలిసిపోయి వారి కష్టసుఖాలు విన్నారు.
వరుసగా నాలుగోసారి చంకూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ప్రజల్లో భావోద్వేగాలు రేగేలా ప్రసంగాలు చేస్తున్నారు. 50 వేల కంటే తక్కువ మెజార్టీ వస్తే దానిని గెలుపుగా భావించలేని చెప్పుకొచ్చారు. 111 రోజుల పాటు సీఎంగా తాను తీసుకున్న నిర్ణయాలను కూడా చన్నీ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ‘‘నేను మీ కుమారుడిని, సోదరుడిని. మీతో కలిసి 15 ఏళ్లుగా ఉన్నాను. ఒక్క రోజు కూడా మిమ్మల్ని విడిచి పెట్టలేదు. మీరు లేకుండా నేను లేను’’ అని చన్నీ చెప్పారు. ఇక బహదూర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్న చన్నీ ప్రచారంలో కాసేపు యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. మొత్తంగా తాను ప్రజల మనిషిననే ముద్ర రావాలని చన్నీ ఆరాటపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment