చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో పూటకో మలుపు చోటు చేసుకుంటుంది. అమరీందర్ సింగ్ రాజీనామా.. చన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం.. సిద్ధూ రాజీనామా చేయడం వంటి సంఘటనలతో పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అమరీందర్ సింగ్ బుధవారం అమిత్ షాతో భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. త్వరలోనే కెప్టెన్ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా అమరీందర్ సింగ్ ఈ వార్తలపై స్పందించారు. బీజేపీలో చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండనని.. అలా అని బీజేపీలో కూడా చేరనని అమరీందర్ స్పష్టం చేశారు. ఎన్‌డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో అమరీందర్ పలు అంశాలపై మాట్లాడారు.
(చదవండి: అమిత్‌తో అమరీందర్ భేటీ)
అమరీందర్ మాట్లాడుతూ.. ‘‘గత 52 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకంటూ కొన్ని విలువలు, నియమాలు ఉన్నాయి. ఉదయం 10.30 గంటలకు ఫోన్ చేసి నన్ను రాజీనామా చేయమన్నారు.. ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు వేయలేదు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలిసి నా రాజీనామాను సమర్పించాను. 50 ఏళ్ల తర్వాత పార్టీకి నా మీద, నా విశ్వసనీయత మీద అనుమానం కలిగింది. నా మీద నమ్మకం లేనప్పుడు నేనేందుకు పార్టీలో ఉండాలి’’ అని ప్రశ్నించారు.
(చదవండి: Navjot Singh Sidhu: సిద్ధూ ఆప్‌లో చేరబోతున్నాడా?)
‘‘పార్టీ నా పట్ల ప్రవర్తించిన తీరు సరిగా లేదు. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు.. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను పార్టీలో ఎలా కొనసాగగలను. నేను నిమిషాల వ్యవధిలో నిర్ణయం తీసుకునే వ్యక్తిని కాను. కాంగ్రెస్‌లో కొనసాగను.. బీజేపీలో చేరను’’ అని అమరీందర్ స్పష్టం చేశారు.
‘‘సిద్ధూకి పరిపక్వత లేదు.. తను స్థిరంగా ఉండలేడు.. జట్టును నడిపించలేడు.. ఒంటరి ఆటగాడు. అలాంటి వ్యక్తి పంజాబ్ కాంగ్రెస్‌ని ఎలా నడిపించగలడు. పార్టీని నడిపించాలంటే టీమ్ ప్లేయర్ కావాలి.. సిద్ధూ అలా ఉండలేడు. తాజా సర్వేల ప్రకారం పంజాబ్‌లో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది.. ఆప్ ఎదుగుతుంది’’ అని అమరీందర్ తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొందరు అమరీందర్‌ని బుజ్జగించే పనిలో ఉన్నారని.. కానీ ఆయన మాత్రం ఎవరిని కలవడానికి ఇష్టపడటంలేదని సమాచారం.
(చదవండి: పార్టీలో కిరికిరి... రాజకీయ హరకిరి)
Comments
Please login to add a commentAdd a comment