సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించామని, దీంతో 10,60,208 మంది లబ్ధిపొందారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2019–20లో 7.58 లక్షలు, 2020–21లో 6.15 లక్షలు, 2021–22లో 5.01 లక్షల మందికి కొత్తగా పింఛన్‌లు ఇచ్చామన్నారు. ఇలా గడిచిన మూడేళ్లలో 18.74 లక్షల పింఛన్‌లను పెంచామన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షలమందికిపైగా లబ్ధిపొందుతున్నట్టు వెల్లడించారు. అర్హత ఉండీ దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో పింఛన్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు.
చేనేతలకు బాబు శూన్యహస్తం: మంత్రి అప్పలరాజు
ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం చేయడానికి చంద్రబాబుకు చేతులు రాలేదని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిహారం చెల్లిస్తే, 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్న 82 చేనేతల కుటుంబాలకు ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వమే పరిహారం చెల్లించిందన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని, 2019–20లో 81,783 మందికి, 2020–21లో 78,211 మందికి, 2021–22లో 80,031 మందికి కలిపి మొత్తం రూ. 576.86 కోట్ల ఆర్థిక సహాయం చేసినట్టు వివరించారు. చేనేతలకు నూలు కొనుగోళ్లలో 40 శాతం మేర సబ్సిడీ చెల్లిస్తున్నామన్నారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు పరిహారాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచాలన్నది సీఎం ఆలోచనని చెప్పారు.
విప్లవాత్మక సంస్కరణలు
నాడు గంగను భగీరథుడు భువికి తీసుకొచ్చినట్టు.. నేడు సీఎం జగన్ ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు.
– పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే
అసమానతలు రూపుమాపుతున్నారు
అంబేడ్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా పేదలకు విద్యనందించి, సీఎం అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నారు.
– మేరుగ నాగార్జున, వేమూరు ఎమ్మెల్యే
స్థానిక భాషలకు ప్రోత్సాహం
బాగా వెనుకబడిన మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా ఈరోజు నాణ్యమైన విద్య అందుతోంది. గిరిజన ప్రాంతాల్లోని స్థానిక భాషలను కూడా ప్రోత్సహించాలి.
– కె.భాగ్యలక్ష్మి,ఎమ్మెల్యే
అందరూ బడికెళుతున్నారు
ఏపీలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పథకాలతో పిల్లలు ఎవ్వరూ బెంగళూరులో పనికి వెళ్లడంలేదు. సొంతూళ్లలో చక్కగా బడికి వెళ్తున్నారు.
– బియ్యపు మధుసూదన రెడ్డి, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment