సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలై 25 రోజులు కావొస్తున్నా, ఆ పార్టీ నేతలు ఇంకా ప్రగతిభవన్‌కు క్యూ కడుతూనే ఉన్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత సీఎం కేసీఆర్‌ను కలిసిన నేతలు తమకు టికెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టికెట్ దక్కిన నేతలు కుటుంబసభ్యులు, సన్నిహితులతో తరలిరావడంతో దాదాపు వారం రోజులపాటు ప్రగతిభవన్‌లో సందడి కనిపించింది.
టికెట్ దక్కని అసంతృప్త నేతలు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా, కొందరికే అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే అభ్యర్థుల ప్రకటన సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 20 రోజుల తర్వాత ఈ నెల 6న తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో పార్టీ టికెట్ దక్కిన ఎమ్మెల్యేలు, నేతలు ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు తరలివస్తుండటంతో మరోమారు ప్రగతిభవన్‌లో సందడి కనిపిస్తోంది.
అసంతృప్తులతో కేటీఆర్ వరుస భేటీలు
టికెట్ దక్కని నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల అ సంతృప్తితో ఉన్నవారు కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మరోమారు అవకాశం ఇస్తామనే మాటకు కట్టుబడి ఉండాల్సి రావడం, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం వంటి కారణాలతో అవకాశం ఇవ్వలేకపోయినట్టు అసంతృప్త నేతలను కేటీఆర్ బుజ్జగిస్తున్నారు.
సర్వేలు, ఇతర వర్గాల నుంచి అందిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాతే టికెట్లు ఇచ్చినట్టు కేటీఆర్ వారికి వివరిస్తున్నారు. అక్టోబర్ మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడు తుందనే అంచనాల నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజవకర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు, బదిలీలు, ఇతర సిఫారసుల కోసం కేటీఆర్‌ను కలుస్తున్నారు.
నియోజకవర్గాల్లో పరిస్థితిపై ‘స్కానింగ్’
అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్ స్థితిగతులు, అభ్యర్థుల పనితీరుపై సర్వే సంస్థలతో పాటు ప్రభుత్వ నిఘా విభాగాల నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదికలు అందాయి. వీటి ఆధారంగా సమస్యాత్మక నియోజకవర్గాలోపరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను కేటీఆర్‌తో పాటు కొందరు ముఖ్య నేతలకు అప్పగించారు. ఇప్పటికే ఆదిలాబాద్, వరంగల్ తదితర జిల్లాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. నర్సాపూర్ టికెట్ ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ వంటి నేతలను కలిశారు.
విపక్ష శిబిరంపై స్పెషల్ నజర్
బీఆర్‌ఎస్ విపక్ష శిబిరాల్లోని కదలికలపైనా దృష్టి సారించింది. కాంగ్రెస్, బీజేపీలో టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న నేతలు, వారిలో టికెట్ దక్కే అవకాశం బలంగా ఉన్నవారు, ఆయా నేతల బలాలు, బలహీనతలపై బీఆర్ ఎస్ కసరత్తు చేస్తోంది. బీఎస్‌పీ, ఉభయ కమ్యూనిస్టులు పోటీ చేసేందుకు అవకాశము న్న స్థానాలు, ఆయా పార్టీల అభ్యర్థులు సాధించే ఓట్లు తదితరాలపైనా బీఆర్‌ఎస్ సూక్ష్మస్థా యిలో లెక్కలు వేస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలో టికెట్ దక్కని నేతలు ఎటు వైపు అడుగులు వేసే అవకాశముంది.. వారిని పార్టీలో చేర్చుకు నేందుకు ఉన్న అవకాశాలపైనా బీఆర్‌ఎస్ అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల షెడ్యూ లు వెలువడేలోగా సొంతగూటిని చక్కదిద్దు కొని, దూకుడుగా వెళ్లేందుకు అవసరమైన వ్యూహాలు, కార్యాచరణకు బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment